ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

ABN, Publish Date - Jun 18 , 2025 | 04:11 AM

అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్‌ ‘నిఘా’ వేసినట్లు తేలింది.

  • షర్మిల కదలికలు, ఫోన్‌ కాల్స్‌పై అబ్జర్వేషన్‌

  • ఆమె మాట్లాడే వారి ఫోన్లూ ట్యాప్‌

  • ఎప్పటికప్పుడు జగన్‌కు సమాచారం

  • నాడు ఒకేసారి 650 మంది ఫోన్లపై నిఘా

  • ఆధారాలు సేకరించిన తెలంగాణ ‘సిట్‌’

  • కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ‘హద్దులు’ దాటిన ట్యాపింగ్‌ వ్యవహారం

  • తెలంగాణలో వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాపింగ్‌

  • జగన్‌ కోసం కేసీఆర్‌ పోలీసుల ‘ఆపరేషన్‌’!

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్‌ ‘నిఘా’ వేసినట్లు తేలింది. ఆమె కదలికలు, ఫోన్‌ సంభాషణలను ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని... వారి ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిర్ధారించింది. వెరసి... తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సరిహద్దులు దాటింది. షర్మిల మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొందరు రాజకీయ నాయకుల ఫోన్లనూ అప్పటి ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో) ‘అబ్జర్వేషన్‌’లో పెట్టినట్లు తెలుస్తోంది. తన ఫోన్‌ను తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు ట్యాప్‌ చేశారని, తన ఫోన్‌ కాల్స్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు సేకరించారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా మంగళవారం ఆరోపించారు.

కోడ్‌ నేమ్‌...

జగన్‌ హయాంలో ఏపీలోనూ భారీ స్థాయిలో ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో సొంత పార్టీ నేతలు కూడా నేరుగా ఫోన్లలో మాట్లాడుకోవడానికి భయపడేవారు. వాట్సాప్‌, ఫేస్‌టైమ్‌ వంటి యాప్‌లు ఉపయోగించుకునేవారు. స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా, పాతకాలపు బటన్‌ ఫోన్లు వాడిన వారూ ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ విచ్చలవిడిగా ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైఎస్‌ షర్మిల 2021లో ‘వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’ ఏర్పాటు చేశారు. తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రం అప్పటి ఏపీ సీఎం జగన్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో ఇరువురి మధ్య ఆస్తి వివాదాలూ తలెత్తాయి. ఈ క్రమంలోనే... అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం ద్వారా చెల్ల్లెలి ఫోన్‌పై నిఘా పెట్టించినట్లు తెలిసింది. షర్మిలతో పాటు, ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి సెల్‌ఫోన్లపైనా ఎస్‌ఐబీ ‘నిఘా’ పెట్టినట్లు సిట్‌ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. షర్మిలకు సంబంధించి ఒక కోడ్‌ నేమ్‌ వాడారని... షర్మిల కదలికలు, సంభాషణలు అన్నీ రికార్డు చేసి నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పంపించారని సమాచారం. కొన్ని ఫోన్లను నెలల తరబడి అబ్జర్వేషన్‌లో పెట్టారని సిట్‌ గుర్తించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతలే లక్ష్యం...

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో భారీ స్థాయిలో రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు బలమైన ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి అగ్రనాయకత్వం వరకు.. అనేకమంది ఫోన్లను ట్యాప్‌ చేశారని తెలుస్తోంది. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు 650మందికి పైగా నాయకుల ఫోన్లను ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్‌ చేయించిందని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొంటున్నారు. దీనిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అంటే 2023 నవంబరులో ఒకేరోజున 600 మంది ఫోన్లను ప్రభాకర్‌రావు టీం ట్యాపింగ్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారని సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌పై అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును ‘సిట్‌’ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ట్యాపింగ్‌ బాధితులైన నేతలు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, గద్వాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు సరిత, ఆమె భర్త వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు.

‘చట్టబద్ధం’ అనిపించేలా...

ఎవరి ఫోన్‌ ట్యాప్‌ చేయాలన్నా... అందుకు అధికారిక అనుమతులు ఉండాలి. ‘రివ్యూ కమిటీ’ ఆమోదం మేరకే ఫోన్లపై నిఘా వేయాలి. అయితే... పైకి లీగల్‌గా కన్పించేలా ‘ఇల్లీగల్‌’ పని చేసినట్లు సిట్‌ ఇప్పటికే గుర్తించింది. మావోయిస్టు సానుభూతిపరుల పేరిట రివ్యూ కమిటీకి ప్రతిపాదనలు పంపించి... అందులో ఫోన్‌ నంబర్లు మాత్రం రాజకీయనేతలవి పెట్టారని గుర్తించింది. వెరసి... ఇది మావోయిస్టుల ముసుగులో జరిగిన రాజకీయ ఆపరేషన్‌! ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు ఇదంతా చేశారనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్‌రావు బుధవారం నాలుగోసారి సిట్‌ ముందు విచారణకు హాజరవుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 04:19 AM