CM Chandrababu: యోగా గేమ్ చేంజర్
ABN, Publish Date - Jun 22 , 2025 | 06:57 AM
పురుగుమందులు, ఎరువులతో భూమి విషతుల్యమైంది. ఇటువంటి భూమిలో పండే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ నుంచి రోజూ ఢిల్లీకి క్యాన్సర్ రోగులు వెళ్తున్నారు.
యోగా గేమ్ చేంజర్
‘‘పురుగుమందులు, ఎరువులతో భూమి విషతుల్యమైంది. ఇటువంటి భూమిలో పండే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ నుంచి రోజూ ఢిల్లీకి క్యాన్సర్ రోగులు వెళ్తున్నారు. కాలు విరిగినా, గుండెకు ఆపరేషన్ జరిగినా శరీరం దెబ్బతింటుంది. అందుకే రోజు గంటపాటు యోగా చేయాలి. యోగాను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తాం. యోగా, నేచురోపతి, ఆయుర్వేదం, ప్రకృతి వ్యవసాయం గేమ్ చేంజర్ అవుతాయి. యోగాతో హింసాప్రవృత్తి తగ్గి, శాంతి కలుగుతుంది. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యోగా మరింత విస్తృతమవుతోంది. యోగా, పర్యాటకాన్ని అనుసంధానం చేస్తాం. దీంతో ఎక్కువమంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఆయిల్ వాడకం, ఉప్పు తినడం తగ్గించాలనే ప్రధాని సూచన అందరం పాటించాలి. ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన పని ఉండదు. వైద్యం, వ్యవసాయ రంగాల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నాం.’’
ఏర్పాట్లు, నిర్వహణ భేష్
‘‘విశాఖలో యోగా డే నిర్వహణకు అవకాశం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు. మంత్రులు, అధికార యంత్రాంగం బాగా పనిచేశారు. ప్రత్యేకించి విశాఖ జిల్లా కలెక్టర్ సహా ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో చిన్నపాటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లుచేశారు. టెక్నాలజీ ఉపయోగించి కంట్రోల్‌రూమ్‌ల ద్వారా పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులంతా సంఘీభావంతో పనిచేశారు. విశాఖ అంటే నాకు అమితమైన అభిమానం. విశాఖ కలెక్టరేట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. హుద్‌హుద్ సమయంలో నగరం సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ 11 రోజులు ఇక్కడే బస చేశాను. హుద్‌హుద్ తుఫాన్ తరువాత దీపావళి పండుగ రోజు బాణసంచా కాల్చవద్దని పిలుపునిస్తే విశాఖలో ఒక్కరు కూడా టపాసులు కాల్చలేదు. ఇప్పుడు యోగాలో పాల్గొనాలని పిలుపునిస్తే అర్ధరాత్రి రెండు గంటల నుంచే ప్రజలు వచ్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశాను’’.
సెప్టెంబరులో యోగా లీగ్
‘‘వచ్చే సెపెంబరులో యోగా లీగ్ ప్రారంభం కానుంది. మోదీ కృషితో యోగా ఒక ఉద్యమంగా మారింది. వికసిత్ భారత్‌లో భాగంగా విజన్ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో భాగంగా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా ఏపీని మారుస్తాం. ‘ఒక భూమి..ఒక ఆరోగ్యం కోసం యోగా’ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళతాం.’’ అని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాని మోదీని సీఎం, డిప్యూటీ సీఎం పవన్ శాలువాతో సత్కరించి, లక్ష్మీనరసింహస్వామి జ్ఞాపికను బహూకరించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, డీబీవీ స్వామి, సత్యకుమార్, పార్థసారధి, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 06:58 AM