Vishakhapatnam: చెట్టు రూపంలో మృత్యువు
ABN, Publish Date - May 06 , 2025 | 05:14 AM
విశాఖపట్నం సీతమ్మధారలో ఒక చెట్టు కొమ్మ విరిగి, ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతున్న పూర్ణిమపై పడింది. తీవ్రంగా గాయపడిన పూర్ణిమ అక్కడికక్కడే మరణించింది
నడుపుతున్న వాహనంపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ
మహిళ దుర్మరణం.. విశాఖలో ఘటన
విశాఖపట్నం/సీతమ్మధార, మే 5(ఆంధ్రజ్యోతి): స్కూటీపై వెళుతున్న మహిళను మృత్యువు చెట్టు రూపంలో మాటేసి కాటేసింది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఏఎంజీ ఆస్పత్రి(నక్కవానిపాలెం) వద్ద సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుని బ్రాంచిలో చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీమకుర్తి సాయిబాబా కుటుంబంతో విశాఖలోని ఏఎంజీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న సితార ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన రోజూ రైలులో తుని వెళ్లి వస్తుంటారు. సోమవారం ఉదయం తుని వెళ్లేందుకు బయలుదేరిన సాయిబాబాను ఆయన భార్య పూర్ణిమ (42) ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌లో దింపి, తిరిగి ఇంటికొచ్చారు.
అనంతరం పూజా సామగ్రి కోసం ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై సీతమ్మధారవైపు బయలుదేరారు. ఏఎంజీ ఆస్పత్రి ఎదురుగా వచ్చేసరికి రోడ్డుపక్కనే ఉన్న తురాయి చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి పూర్ణిమ నడుపుతున్న వాహనంపై పడింది. స్థానికులు వెంటనే స్పందించి చెట్టుకొమ్మను వెంటనే తొలగించినప్పటికీ తలకు తీవ్రమైన గాయాలవడంతో పూర్ణిమ అక్కడికక్కడే మరణించారు. అదే సమయంలో డెబ్రిస్ లోడుతో వెళ్తున్న జీవీఎంసీ ట్రాక్టరుపై కూడా కొమ్మ భాగం పడడంతో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. రోడ్డుపక్కనే నిలిపి ఉన్న మరో కారు కూడా ధ్వంసమైంది. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - May 06 , 2025 | 05:15 AM