Cricket Betting Gang Nabbed: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. 13 మంది అరెస్ట్
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:30 PM
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి భారీఎత్తున సెల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకాలతోపాటు ఏటీెఏం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం, జులై 03: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13మందిని గురువారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ ట్యాప్‌లతోపాటు 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాలో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన వారు ఉన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. విశాఖపట్నం వాసి రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. నగదు అవసరం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారి బ్యాంకు ఖాతాలను ఈ బెట్టింగ్ ముఠా సేకరించినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ట్రావెల్స్ బస్సుల ద్వారా బెట్టింగ్ ముఠాలోని కీలక వ్యక్తులను అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన వ్యక్తి పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సదరు ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా అమాయకులకు వల వేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్న వారిపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
Updated Date - Jul 03 , 2025 | 05:41 PM