Visakhapatnam Yoga Event: యోగాంధ్రకు అఖండ స్పందన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి
ABN, Publish Date - Jun 04 , 2025 | 03:40 AM
విశాఖపట్నంలో జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి సంతృప్తి
21న విశాఖలో ప్రధాని హాజరయ్యే యోగా డేలో 5 లక్షల మంది పాల్గొనాలి
గిన్నిస్ రికార్డు సృష్టే లక్ష్యం: చంద్రబాబు
అమరావతి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్రకు ప్రజల నుంచి అఖండ స్పందన వస్తోందంటూ సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సన్నాహక ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్లు, ప్రజల భాగస్వామ్యం ఆకట్టుకున్నాయని తెలిపారు. అత్యధిక భాగస్వామ్యంతో అతిపెద్ద యోగా సెషన్ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో యోగాంధ్రపై ఆయన సమీక్ష జరిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 21న విశాఖలో జరిగే కార్యక్రమంలో 5లక్షల మంది పాల్గొనేలా కచ్చితమైన ఏర్పాట్లు చేయాలని సృష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్నారని గుర్తుచేశారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు ఉండాలని.. వివిధ ప్రాంతాల నుంచివచ్చే ప్రజలకు వేదిక వద్ద, బయటకు వెళ్లే మార్గాలపై స్పష్టత ఉండాలని సూచించారు. 7న ప్రతి గ్రామంలో, ప్రాంతంలో యోగా అవగాహన ర్యాలీలు జరుగుతాయని, 14న విద్యాసంస్థలు, అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాలు సహా లక్ష ప్రదేశాల్లో యోగా సాధన సెషన్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడంతో పాటు యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని సీఎం సూచించారు.
ఆ రోజు వర్షం పడితే..!
21న విశాఖలో వర్షం పడితే బ్యాకప్ వేదికలుగా జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు లోకేశ్, కందుల దుర్గేశ్, అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు వస్తున్నాయని, సంఖ్యలు అంచనాలకు మించి ఉన్నాయని స్పెషల్ సీఎస్, నోడల్ అఽధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం 2కోట్ల మంది పాల్గొంటారని, ఇందులో 1.77కోట్ల మంది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు. 1.25 లక్షల మంది యోగా అభ్యాసకులకు శిక్షణ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా.. 1.48 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 03:43 AM