CM Chandrababu: ఆరోగ్యాంధ్రే లక్ష్యం
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:46 AM
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నామని, అందులో భాగంగా 21న విశాఖలో ‘యోగాంధ్ర’ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ఆ రోజు ప్రధాని మోదీ సమక్షంలో....
ప్రధాని సమక్షంలో విశాఖ యోగా డిక్లరేషన్
21న బీచ్ రోడ్డులో 5 లక్షల మందితో యోగాంధ్ర: సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు
విశాఖలో కార్యక్రమం చేపట్టాలని మోదీ అడిగారు
దీంతో చరిత్రలో నిలిచేలా కార్యక్రమానికి శ్రీకారం
లక్ష ప్రాంతాల్లో నిర్వహణ.. లక్ష్యం 2 కోట్ల మంది
22 అంశాల్లో గిన్నిస్ రికార్డుకు యత్నం
20న మాక్ ఈవెంట్.. లోపాలుంటే సరిచేస్తాం
21న ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి
గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి చిత్తూరులో పైలట్ ప్రాజెక్టు
ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు: సీఎం
విశాఖలో యోగా వేడుకల ఏర్పాట్లపై సమీక్ష
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేపట్టాం. చిత్తూరులో ఆరు నెలల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత రాష్ట్రమంతా చేస్తాం.
యోగాంధ్రను ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కలుషిత ఆలోచనలతో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే వారికి ఆ విధమైన ఫలితాలే వస్తాయి.
- సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నామని, అందులో భాగంగా 21న విశాఖలో ‘యోగాంధ్ర’ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ఆ రోజు ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించే ఈ కార్యక్రమ సన్నాహాలను సమీక్షించేందుకు సోమవారం చంద్రబాబు విశాఖ వచ్చారు. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్కే బీచ్‌రోడ్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానాలను సందర్శించారు. అనంతరం నోవాటెల్ హోటల్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. భారతీయ వారసత్వ సంపదగా వచ్చిన యోగా వల్ల అందరికీ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన ప్రధాని.. దీనిని ఐక్యరాజ్యసమితికి చెప్పి ‘జూన్ 21’ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసి పదేళ్లు పూర్తయిందని గుర్తుచేశారు. 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో విశాఖలో భారీ కార్యక్రమం నిర్వహించాలని ఆయన కోరగా తాను అంగీకరించినట్లు తెలిపారు. ఇందుకోసం ‘యోగాంధ్ర’కు నెల క్రితమే శ్రీకారం చుట్టామన్నారు.
ఈ వేడుక గిన్నీస్ రికార్డులకు ఎక్కేలా, చరిత్రలో నిలిచిపోయే అతి పెద్ద ఈవెంట్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 22 అంశాల్లో రికార్డులు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే లక్ష్యమని చెప్పారు. ‘దేశంలో మొత్తం లక్ష ప్రాంతాల్లో యోగా డే నిర్వహించాలని ప్రధాని చెప్పగా.. ఒక్క మన రాష్ట్రంలోనే లక్ష ప్రాంతాల్లో జరుపుతున్నాం. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అందమైన బీచ్ ఉంది. ఈ రోడ్డులో ఐదు లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నాం. ఇందులో నెల రోజులు యోగా ప్రాక్టీస్ చేసినవారు 3.26 లక్షల మంది ఉన్నారు. వారికి యోగా మ్యాట్లు ఇస్తున్నాం. బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్టుమెంట్లు పెట్టి, ఒక్కో దాంట్లో వెయ్యి మందితో యోగాసనాలు వేయిస్తాం. అందరికీ క్యూఆర్ కోడ్‌తో సీటింగ్ కేటాయిస్తారు. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 5 లక్షల మందికీ యోగాంధ్ర టీ షర్టులు అందిస్తాం. తూర్పు నౌకాదళం 11 యుద్ధ నౌకలపై యోగా దినోత్సవం నిర్వహిస్తుంది. పాడేరులో శిక్షణ పొందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం వచ్చి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో యోగాసనాలు వేస్తారు. ఇది కూడా ఒక రికార్డు కానుంది. తొమ్మిదో తరగతి నుంచి ప్రతి విద్యార్థి యోగా నేర్చుకుని, నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. దీనికి కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేవని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. యోగాతో అనారోగ్యాన్ని నివారించవచ్చు. రాష్ట్రంలో మొత్తం రెండు కోట్లతో మందితో యోగా చేయాలని భావించగా.. ఇప్పటికే 2.17 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. మూడు రోజులు యోగా చేసిన 25 లక్ష మందికి ప్రభుత్వం తరపున సర్టిఫికెట్లు ఇస్తాం. 21వ తేదీన వర్షం కారణంగా బీచ్ రోడ్డులో కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి వస్తే ప్లాన్-బీ కింద ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు చేశాం. వర్షం పడకపోతే రెండు వేదికలపైనా కార్యక్రమం జరుగుతుంది. 106 పర్యాటక ప్రాంతాల్లో పది వేల మంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చారు’ అని వివరించారు.
పద్ధతి పాటించండి: సీఎం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో నిర్వహించే కార్యక్రమానికి పార్టీ నేతలు గుంపులుగా రావద్దని, ప్రధాని నరేంద్రమోదీ దృష్టిలో పడాలని ప్రత్యేక ఆసక్తి చూపవద్దని నాయకులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం గిన్నీస్ బుక్ రికార్డు కోసం నిర్వహిస్తున్నామన్నా రు. దీనిలో అంతా యోగా ప్రాక్టీస్ చేసేవారు ఉంటారని స్పష్టంచేశారు. వారిని పక్కనపెట్టి నాయకులు, ఇతరులు వేదిక వద్దకు రావద్దని, అధికారులు సూచించిన విధంగా నడుచుకోవాలని చెప్పారు. ప్రధానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 1987లో నిర్వహించిన మహానాడును గుర్తు చేసుకున్నారు. అందరికీ పసుపు చొక్కాలు వేసుకొని రమ్మన్నామని, అలా రాని వారి చొక్కాలను పసుపు నీళ్ల డ్రమ్ములో ముంచి ఇచ్చామన్నారు.
యోగా డిక్లరేషన్..
ముఖ్యమంత్రిగా తాను ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలన్నింటిలో ఇదే పెద్దదని, చరిత్రలో నిలిచిపోయేలా చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు కార్యక్రమం పూర్తయ్యాక ప్రధానితో కలిసి ‘విశాఖ యోగా డిక్లరేషన్’ ప్రకటిస్తామన్నారు. ‘యోగాతో అనారోగ్యం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా వ్యాధి వస్తే మందులు తీసుకుంటున్నాం. అవన్నీ రసాయనాలు. అదే యోగా చేస్తే మందుల అవసరం ఉండదు. దీనివల్ల రూ.వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించి యోగా చేయాలి. 21వ తేదీన బీచ్ రోడ్డుకు రాలేని వారు ఇళ్లల్లోనే యోగా చేయండి. త్వరలో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికీ ‘డిజిటల్ హెల్త్ రికార్డులు’ ఇస్తాం. 20వ తేదీన విశాఖలో మాక్ ఈవెంట్ నిర్వహించి లోపాలుంటే సరిదిద్దుతాం. 21వ తేదీన ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు’ అని తెలిపారు.
వారికి ఇబ్బందులు రాకూడదు
ఆర్కే బీచ్ వేదికగా భీమిలి వరకూ జరిగే యోగా వేడుకల్లో ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ముఖ్యంత్రికి వివరించారు. యోగా డేకు హాజరవుతున్న వారిని సమన్వయం చేసే బాధ్యతలు 607 సచివాలయాల సిబ్బందికి అప్పగించామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనడానికి రిజిస్ర్టేషన్ చేసుకున్న వారికి ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్‌ను, ఇతర అధికారులను సీఎం ఆదేశించారు. యోగా డేలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని సూచించారు. ఆ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాని సహా ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను పోలీసు అదికారులు సీఎంకు వివరించారు. వాహనాల పార్కింగ్‌కు చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి పి. నారాయణ, ఎంపీ ఎం. శ్రీభరత్, యోగాంధ్ర-2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబుతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 05:54 AM