ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Electricity Issues: ఇవేం కోతలు బాబోయ్‌

ABN, Publish Date - Jun 16 , 2025 | 03:55 AM

రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఓవైపు.. కరెంటు కోతలు మరోవైపు.. వెరసి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాతావరణ పరిస్థితులు గమనిస్తే.. ఆకాశంలో మబ్బులుంటాయి.. వాతావరణం చల్లగా ఉంటుందేమోనని ఆశిస్తే.. భరించలేనంత ఉక్కబోత ఉంటోంది.

  • రాష్ట్రంలో విచిత్ర వాతావరణం

  • తీవ్రమైన ఉక్కబోత.. జనం ఉక్కిరిబిక్కిరి

  • అదే సమయంలో కరెంట్‌ కోతలు

  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి

  • కోతలు కావు.. అంతరాయమేనంటున్న డిస్కమ్‌లు

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఓవైపు.. కరెంటు కోతలు మరోవైపు.. వెరసి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాతావరణ పరిస్థితులు గమనిస్తే.. ఆకాశంలో మబ్బులుంటాయి.. వాతావరణం చల్లగా ఉంటుందేమోనని ఆశిస్తే.. భరించలేనంత ఉక్కబోత ఉంటోంది. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కరెంటు పోతోంది. ఎక్కడో లైన్‌ ప్రోబ్లమ్‌ ఏమో అనుకుంటే, రాత్రి సమయంలోనూ ఇదే పరిస్థితి. అర్ధరాత్రి వేళ సరిగ్గా కునుకుపడుతున్న సమయంలోనూ కరెంటు పోతోంది. దీంతో జనంలో అసహనం పెరుగుతోంది. ఏదైనా సాంకేతిక లోపమేమో, విద్యుత్తు డిమాండ్‌ పెరిగిపోవడమోనని ఆరా తీస్తే.. అందుకు భిన్నంగా, రోజుకు 242 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ కాస్తా క్రమంగా పడిపోతోందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి, డిమాండ్‌, కొనుగోలు వివరాలు తెలుసుకుందామంటే ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఏపీపీసీసీ) అందుబాటులోకి రావడంలేదు. విద్యుత్తు గ్రిడ్‌ సరఫరా పరిస్థితిపై ఆరా తీస్తే లోడ్‌ రిలీఫ్‌ ఎక్కడా ఎక్కువగా లేదని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం, కొత్తపేటల్లో ట్రాన్స్‌మిషన్‌ టవర్లను మార్పుచేయాల్సి వస్తున్న సమయంలోనే విద్యుత్తు అంతరాయం ఉంటుందే తప్ప.. ప్రత్యేకంగా కరెంటు కోతలు లేవని డిస్కమ్‌లు చెబుతున్నాయి.

విద్యుత్తు డిమాండ్‌.. కొనుగోళ్లు

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ ఆదివారంనాడు 215.549 మిలియన్‌ యూనిట్లుగా ఉందని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఇందులో ఏపీ జెన్కో థర్మల్‌ యూనిట్ల నుంచి 88.185 మిలియన్‌ యూనిట్లు, ఏపీజెన్కో హైడల్‌ నుంచి 4.565 మిలియన్‌ యూనిట్లు, ఏపీజెన్కో సోలార్‌ నుంచి 1.510, సెంట్రల్‌ జనరేషన్‌ స్టేషన్ల నుంచి 34.969, ఐపీపీ (సెయిల్‌, హిందూజా)ల నుంచి 45.101, ప్రైవేట్‌ విండ్‌ నుంచి 21.687, ప్రైవేటు సోలార్‌ నుంచి 16.336 మిలియన్లు ఉండగా, మార్కెట్‌ నుంచి అదనంగా 12.808 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేశారు.

ఒకవైపు అత్యవసర కొనుగోళ్లు.. మరోవైపు జెన్కోలో బ్యాకింగ్‌ డౌన్‌

రాష్ట్రంలో ఒకవైపు డిమాండ్‌ పెరిగి రోజుకు 12.808 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తుంటే, మరోవైపు రాయలసీమ థర్మల్‌ ప్లాంటులో 1.303 మిలియన్‌ యూనిట్లు, విజయవాడ థర్మల్‌ స్టేషన్‌లో 0.601, కృష్ణపట్నంలో 0.295.. మొత్తంగా 2.199 మిలియన్‌ యూనిట్లను పీక్‌ అవర్‌లో (రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు) యూనిట్‌కు సగటున పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే గణాంకాలేవీ బహిర్గతం చేయడం లేదు. గతంలో 2014-19 మధ్య కాలంలో విద్యుత్తు గణాంకాలన్నీ పారద్శకంగా ఆన్‌లైన్‌లో కనిపించేవి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయంలో విద్యుత్తు గణాంకాలన్నీ తెరచాటుకు వెళ్లిపోయాయి. ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి ప్లాంట్లలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి బ్యాకింగ్‌ డౌన్‌ చేయించి బహిరంగ మార్కెట్లో భారీగా డబ్బు చెల్లించి కరెంటు కొన్నారు. వినియోగదారులపై ఇంధన సర్దుబాటు పేరిట రూ. వేల కోట్లు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏపీపీసీసీ, ఏపీ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎ్‌సఎల్‌డీసీ) తీరులో మార్పేమీ రాలేదు. విద్యుత్తు కొనుగోళ్ల సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. కరెంటు కోతలు అధికారికంగా లేవని, అంతరాయం మాత్రమే ఉందని డిస్కమ్‌లు చెబుతున్నా.. సరఫరా నిలిచిపోవడాన్ని సామాన్యుడు కరెంటు కోతగానే భావిస్తాడు. అయితే ఈ వాదనలకు డిస్కమ్‌లు మాత్రం సాంకేతిక సాకులు చూపుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్తు డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండటంతో రైతాంగ నుంచి కరెంటు సరఫరాపై పెద్దగా ఆందోళన లేదు. అయితే, ఏరువాక మొదలైనందున మున్ముందు వ్యవసాయ విద్యుత్తు డిమాండ్‌ పెరిగితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 16 , 2025 | 03:56 AM