IPS Sanjay Corruption Case: ముందస్తు బెయిల్‌పై 49 పేజీల తీర్పా
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:29 AM
వైసీపీ హయాంలో అగ్నిమాపక విభాగంలో పనిచేసినప్పుడు ఐపీఎస్ అధికారి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలకు..
బెయిల్ దశలోనే మొత్తం విచారణ జరిపినట్టు ఉంది
ఐపీఎస్ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యం
వారంలో ఒప్పంద పత్రం, ఇన్‌వాయి్‌సలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అగ్నిమాపక విభాగంలో పనిచేసినప్పుడు ఐపీఎస్ అధికారి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు 49 పేజీలతో తీర్పు వెలువరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తీర్పు తీరును చూస్తే.. ముందస్తు బెయిల్ దశలోనే మొత్తం కేసు విచారణను జరిపినట్టు ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రం, ఇన్‌వాయి్‌సలను వారం రోజుల్లో (ఈనెల 30వ తేదీ) అందజేయాలని ఆదేశించింది. అదే రోజు తదుపరి వాదనలు వింటామని జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. విచారణ సందర్బంగా.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. సంజయ్ అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, హైకోర్టు మాత్రం అవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సంజయ్ వైసీపీ హయాంలో అగ్నిమాపక విభాగం, సీఐడీ విభాగాల్లో పనిచేశారు. ఈ సమయంలో ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు కూటమి ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రెండు వేర్వేరు నివేదికలు ఇచ్చింది. ‘‘అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. అలాగే, సీఐడీ చీఫ్ హోదాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీ్‌సకు ఇచ్చి, రూ.1.19 కోట్లు చెల్లించారు. కానీ, సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.రెండు కోట్ల మేర నష్టం కలిగించారు.’’ అని ఆ నివేదికల్లో పేర్కొంది. వాటి ఆధారంగా సంజయ్‌పై అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఏపీ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మార్చి 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 03:29 AM