Supreme Court Cancels Bail: వంశీకి సుప్రీం షాక్
ABN, Publish Date - Jul 18 , 2025 | 03:54 AM
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కనపెట్టిన కోర్టు
రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్
పీటీ వారంట్స్ గురించి ఏదో అనబోగా.. వంశీ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం
ప్రభుత్వం వాదనలు సమగ్రంగా విని తీర్పునివ్వాలని హైకోర్టుకు ఆదేశాలు
4 వారాల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందనే ఏపీ ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత నెల 12వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రూ.195 కోట్ల అక్రమ మైనింగ్ వ్యవహారంలో వంశీ ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వంశీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ సహా అనేక కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారని, తమ వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వంశీకి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. కాగా, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మైనింగ్ విలువలపై సీల్డ్ కవర్‌లో నివేదికను ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పుపట్టింది. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడంలేదని తెలిపింది. పీటీ వారంట్స్ పేరిట వంశీని ఇబ్బంది పెడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పేందుకు ప్రయత్నించగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. పీటీ వారంట్స్ అంశంలోకి తాము వెళ్లడం లేదని స్పష్టంచేసింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. కాగా, వారంరోజుల్లో ఏపీ ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. అలాగైతే.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్
Updated Date - Jul 18 , 2025 | 03:54 AM