Andhra Pradesh on High Alert: ఉద్రిక్తతలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
ABN, Publish Date - May 09 , 2025 | 04:41 AM
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా భద్రతా చర్యలు సమీక్షించి, స్థానికుల సహకారం కోరారు
అమరావతి/పొన్నూరు టౌన్, మే 8(ఆంధ్రజ్యోతి): భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సమీక్షించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర సీనియర్ ఐపీఎ్‌సలతో సమావేశమ య్యారు. తీరప్రాంతంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల భద్రత, వీఐపీల రక్షణపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, వీఐపీల ప్రొటోకాల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు సూచించారు. ప్రజలు, వీఐపీలు, పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టుల రక్షణలో రాజీవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలిచ్చారు.
ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి
ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని హైఅలర్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వానికి స్థానికులు కూడా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై భారతీయులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టి ఆత్మస్థైర్యం నింపిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళలు కూడా పాలు పంచుకోవడం గర్వంగా ఉందన్నారు.
Updated Date - May 09 , 2025 | 04:41 AM