ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Forecast: నేడో, రేపో నైరుతిలో కదలిక..

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:21 AM

దాదాపు రెండు వారాల విరామం తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుంది. గత నెల 29వ తేదీ తర్వాత నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే వాతావరణం నెలకొంది.

  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

  • అల్పపీడనంగా మారే అవకాశం

  • కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): దాదాపు రెండు వారాల విరామం తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుంది. గత నెల 29వ తేదీ తర్వాత నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే వాతావరణం నెలకొంది. రుతుపవనాలు నిలిచిపోవడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. ప్రధానంగా ఉత్తరాదిలో తీవ్రమైన వడగాడ్పులతో ప్రజలు ఉడికిపోతున్నారు. అయితే హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు దక్షిణ భారతం వైపు వస్తున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో కర్ణాటక, కొంకణ్‌, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో వర్షాలు పెరగనున్నాయి. దీనికి బలం చేకూరేలా ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ మధ్య రుతుపవనాలు ఉత్తర దిశగా పురోగమించేందుకు అవకాశాలున్నాయని వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే రుతుపవనాలు ఈ నెల 14 నుంచి మధ్య, తూర్పుభారతం వైపు పయనిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రాయలసీమ, కోస్తాల్లో వర్షాలు కురిశాయి.

మధ్య, తూర్పుభారతంలో వర్షాలు పెరుగుతాయి

ప్రస్తుతం నైరుతి రుతుపవనాల్లో కదలిక రావడంతో మధ్య, తూర్పు భారతం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు మధ్య, తూర్పు భారతం దాటి ఉత్తరాదిలోకి ప్రవేశించేంత వరకు రాజస్థాన్‌, ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, యూపీ, పరిసర ప్రాంతాల్లో ఎండలు, గాడ్పులు కొనసాగుతాయని హెచ్చరించారు. దీంతో రాత్రి కూడా వేడి వాతావరణం నెలకొంటుందని, ఇది పంటలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

నేడు అక్కడక్కడా భారీ వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో రెండ్రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం మన్యం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరుగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు మన్యం జిల్లా రస్తాకుంటుబాయిలో 72, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 65.2, కోనసీమ జిల్లా తాతపూడిలో 47, ప్రకాశం జిల్లా కొలుకులలో 44.7 మిల్లీమీటర్ల వాన పడింది.

Updated Date - Jun 12 , 2025 | 07:01 AM