Coastal Andhra Weather: రెండు రోజుల్లో కేరళకు నైరుతి
ABN, Publish Date - May 24 , 2025 | 04:20 AM
కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
రుతుపవనాల ప్రవేశానికి అనుకూల వాతావరణం
అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం
నేడు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రుతుపవన గాలులు హిందూ మహాసముద్రం మీదుగా అరేబియా, బంగాళాఖాతం వైపు వీస్తున్నాయి. దీంతో కేరళ, కర్ణాటకల్లో 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో దక్షిణ కొంకణ్‌కు ఆనుకుని అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.
27న బంగాళాఖాతంలో అల్పపీడనం
కాగా, ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో రుతుపవన కరెంట్ బలంగా ఉంది. దీంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున 27 వరకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు అక్కడక్కడా మోస్తరు వర్షాలు
శనివారం అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మేఘాలు ఆవరించని ప్రాంతాల్లో ఎండ, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం తిరుపతి జిల్లా గుండుపల్లిలో 39.8, నెల్లూరు జిల్లా మునబోలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - May 24 , 2025 | 04:21 AM