ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: చట్ట నిబంధనలు అనుసరించే ఎస్సీ వర్గీకరణ

ABN, Publish Date - Apr 29 , 2025 | 03:27 AM

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగా చేపట్టిందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు

  • జాతీయ ఎస్సీ కమిషన్‌ సైతం వర్గీకరణకు ఆమోదం

  • సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం

  • ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఆధారంగానే ఆర్డినెన్స్‌

  • హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీనివాస్‌

  • కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • విచారణ ఆరు వారాలకు వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టనిబంధనలకు అనుగుణంగానే నడుచుకుందని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించారని చెప్పారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ సైతం వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదిక, చేసిన సిఫారసుల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌(2/2025)ను తీసుకొచ్చిందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు పరసా సురేశ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.


ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్నారు. ఎస్సీ ఉపకులాల వెనుకబాటుతనంపై శాస్త్రీయ అధ్యయనం జరపలేదన్నారు. ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రజా బాహుళ్యంలో ఉంచలేదని, ప్రజల నుంచి అభ్యంతరాలు కోరలేదని అన్నారు. ఏకసభ్య కమిషన్‌ నియామకాన్ని సైతం సవాల్‌ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఏకసభ్య కమిషన్‌ను నియమించడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వద్ద నుంచి పొందేందుకు ప్రయత్నం చేశారా..? అని పిటిషనర్‌ను ఆరా తీసింది. నివేదికను పరిశీలించకుండానే ఎస్సీ వర్గీకరణకు కారణాలు పేర్కొనలేదని ఎలా చెబుతారని నిలదీసింది. నివేదిక పొందేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే హడావుడిగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Apr 29 , 2025 | 03:28 AM