Manamitra WhatsApp Governance: వాట్సాప్‌లో రైస్‌కార్డు సేవలు
ABN, Publish Date - May 25 , 2025 | 04:23 AM
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రైస్ కార్డు సేవలు, 8 రకాల సివిల్ సప్లయిస్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం వీటిలో లేదు కనుక రైతులు, పౌరులు ఇంకా సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.
కార్డులో మార్పుచేర్పులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
మొత్తం ఎనిమిది రకాల సేవలు అందుబాటులోకి
అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): రైస్ కార్డులో మార్పుచేర్పులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఎనిమిది రకాల సేవలు ఉన్నప్పటికీ, ప్రధానంగా కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలా దరఖాస్తు చేయాలి...
మొబైల్ ఫోనులో ‘మనమిత్ర’ వాట్సాప్ చాట్‌లోకి వెళ్లి ‘హాయ్’ అని టైప్ చేస్తే ‘సేవను ఎంచుకోండి’ అని వస్తుంది. దానిని క్లిక్ చేస్తే ‘పౌర సేవను ఎంచుకోండి’ అనే బాక్స్‌లో ‘సివిల్ సప్లయిస్ సేవలు’పై క్లిక్ చేయాలి. ‘దీపం’ స్థితి, రైస్ డ్రా స్థితి, రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డు సమర్పణ, రైస్ కార్డులో సభ్యులను జోడించడం, రైస్ కార్డులో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, రేషన్ కార్డ్ విభజన దరఖాస్తు.. అనే 8 రకాల సేవలు కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన సేవను ఎంపిక చేసుకుని.. వివరాలను పూరించి, వాట్సాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.
జాప్యాన్ని నివారించడానికే...
కొత్త రైస్ కార్డులతో పాటు ఇతర సేవల కోసం ఈ నెల 7నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే భారీసంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడుతుండటంతో ఒత్తిడి పెరిగి సర్వర్లు డౌన్ అయిపోవడం, ఇతర సాంకేతిక సమస్యలతో వాటిని ఆన్‌లైన్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో రైస్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా ‘మనమిత్ర’ (వాట్సాప్ గవర్నెన్స్) సేవలను ఈ నెల 15 నుంచే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాంకేతికపరమైన కారణాలతో ఈ సేవలను ప్రకటించిన సమయానికి అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఎట్టకేలకు శనివారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దరఖాస్తుదారులకు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే ఇందులో కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇలాంటి వారంతా తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్లాల్సిందే. కాగా, ఈ నెల 7 నుంచి 24 వరకు మొత్తం 7,21,827 దరఖాస్తులు వచ్చాయి.
Updated Date - May 25 , 2025 | 04:24 AM