Security Awareness: భద్రతా సన్నద్ధతకే మాక్ డ్రిల్స్
ABN, Publish Date - May 07 , 2025 | 06:32 AM
భద్రతా సన్నద్ధత కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలనీ రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన వెంకటరావు అన్నారు. ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్థాన్‌పై ప్రభుత్వ చర్యలకు ప్రజల మద్దతు అవసరం అని సూచించారు
ప్రజల్లో అవగాహన , చైతన్యం కోసం నిర్వహణ
దేశ రక్షణలో ప్రభుత్వానికి అండగా నిలవాలి
భారత రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన వెంకటరావు
తణుకు రూరల్, మే 6(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలకు దేశ ప్రజలంతా మద్దతుగా నిలవాలని రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన వెంకటరావు పిలుపునిచ్చారు. మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల భద్రతా సన్నద్ధతపై ప్రజల్లో అవగాహన ఏర్పడటంతో పాటు ఒకవేళ యుద్ధం వస్తే శత్రుదేశాల దాడుల నుంచి ప్రాణాలు, వనరులను కాపాడుకోవడంపై వారిని సంసిద్ధం చేయడానికి దోహదం చేస్తుందని చెప్పారు. 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి బొల్లిన వెంకటరావు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
మాక్ డ్రిల్ ఉద్దేశం ఏమిటి?
ఉద్రిక్తతలు నెలకొన్న సమయాల్లో మాక్ డ్రిల్స్ మామూలే. కార్గిల్, పార్లమెంటుపై దాడి, పుల్వామా దాడి సమయంలోనూ వీటిని చేపట్టారు. అప్పట్లో మిలిటరీ బేస్‌ల్లోనే సాగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుదేశం జరిపే దాడుల నుంచి తమను తాము ఏ విధంగా కాపాడుకోవాలనే అంశంపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంచడానికి వీటిని నిర్వహిస్తారు.
ఉగ్రదాడి అనంతరం పాక్ పరిస్థితి ఏమిటి?
ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత ్వం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా అక్కడి జనాభాలో 40శాతం మందికి ఉపాధి కల్పిస్తూ జీడీపీకి 24 శాతం తోడ్పడే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాఠా, అటారీ సరిహద్దులు మూసేయడంతో పాటు ఆ దేశంతో వర్తక, వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్థాన్‌తో సముద్ర రవాణా మార్గాలను, మన గగనతలాన్ని సైతం మూసివేసింది. ఈ చర్యలు పాక్ ఆహార భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
భారత్ వ్యూహమెలా ఉండనుంది?
పహల్గాం ఘటన తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేస్తుందనే భయం పాక్‌లో ఉంది. ఎటునుంచి యుద్ధం ప్రారంభిస్తుందోనని ఆందోళన చెందుతోంది. ఈ విధంగా ఆందోళన, భయంతో వాళ్లను ఎంతకాలం ఉంచితే అంతగా బలహీనపడతారు. ఇదీ ఒక వ్యూహమే. పాక్ ఒక ప్రాణాంతక క్యాన్సర్ లాంటిది. అందుకే ఈ విషయంలో భారత్ ఓపికను ప్రదర్శిస్తోంది. శత్రువుపై దాడిచేసే ముందు వారు బలహీనపడేలా చేయడమూ వ్యూహమే. మనం ఎంత ఎక్కువ సమయం వేచిచూస్తే పాక్ అంతగా బలహీనపడుతుంది.
మన దేశ రక్షణ వ్యవస్థ గురించి...?
మన రక్షణ వ్యవస్థ, సైనిక సంసిద్ధత దృఢమైనవే. కానీ సంయమనంతో ఉంటాం. నియంత్రణ రేఖను దాటకుండానే దాడి చేయగల ఆత్యాధునిక ఆయుధ సామర్థ్యం మనకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం దీటుగా బదులు చెబుతోంది.
భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు ఎలా ఉంటుంది?
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ర్టేలియా, ఇజ్రాయెల్ తదితర దేశాలు పహల్గాం దాడిని ఖండించాయి. ఈ విషయంలో పాక్ వాదనలు ఆయా దేశాలు తిరస్కరించాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధులను అరికట్టడం ద్వారా పోరాడేందుకు తగిన వనరులు లేక యుద్ధం కొనసాగించలేని స్థితిలోకి పాక్ జారుకుంటుంది. కేంద్రం అనుసరిస్తున్న వ్యూహంతో పాక్ దీర్ఘకాలంలో పూర్తిగా బలహీనపడుతుంది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ బొల్లిన వెంకటరావు ఆర్మీలో వివిధ హోదాల్లో సేవలందించి పదవీ విరమణ పొందారు. భారత రక్షణ దళంలో చేసిన ఈయన సేవలకు గాను 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పతకం అందుకున్నారు. 1987లో శ్రీలంకలో జరిగిన ఆపరేషన్ ‘పవన్’లో, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో, 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడికి సంబంధించిన చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్‌లో, 2009-15 వరకూ జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ‘రక్షక్’లో పాల్గొన్నారు. ఆయన తండ్రి బొల్లిన విశ్వనాథం తణుకు ప్రాంతంలో రైతు సంఘం నాయకుడిగా ప్రసిద్ధి చెందారు.
Updated Date - May 07 , 2025 | 06:32 AM