Andhra Pradesh Farmers: చినుకు లేక చింత
ABN, Publish Date - Jul 18 , 2025 | 03:16 AM
నైరుతి రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంలో వర్షపా తం తగ్గింది.
ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు
మందకొడిగా రుతుపవనాలు.. చాలీచాలని వర్షాలు
లోటు వర్షపాతంతో అన్నదాత విలవిల.. తడులకు నోచని మెట్ట పైర్లు
జూన్ 1 నుంచి జూలై 16 వరకు.. కురిసిన వర్షం 107.7 మిల్లీమీటర్లే
మొత్తంగా 37.5ు వానలోటు.. 7.21 లక్షల హెక్టార్లలోనే సాగు
ఇప్పటికైనా విస్తారంగా కురిస్తే సాగు పుంజుకునే అవకాశం
పంటలు ఎండు ముఖం..
అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంలో వర్షపా తం తగ్గింది. చాలీచాలని వర్షాలతో ఖరీఫ్ సాగు నత్తనడక నడుస్తోంది. విస్తారంగా వర్షాలు కురవాల్సిన జూన్, జూలై నెలల్లో వాన పడక.. వేసిన పంటలు ఎండుముఖం పట్టి.. రైతులు బిక్కమొగం పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 574.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండ గా.. జూన్ 1 నుంచి జూలై 16 వరకు 172.4 మిల్లీమీటర్ల వాన పడాల్సి ఉంది. కానీ 107.7 మిల్లీమీటర్ల వానే కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 37.5 శాతం వాన లోటు ఏర్పడింది. మెట్ట పైర్లకు నీటి తడులు పూర్తిగా కరువయ్యాయి. దాదాపు నెల రోజులుగా వాన జాడ లేకపోవడంతో.. వేసిన పంట దెబ్బతిని, రైతులు కొత్తగా విత్తనం వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో 31.16 లక్షల హెక్టార్లల్లో ఖరీఫ్ పంటలు సాగవ్వాల్సి ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 9.67 లక్షల హెక్టార్లల్లో విత్తనం పడాల్సి ఉండగా.. 7.21 లక్షల హెక్టార్లలోనే వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విత్తనాలు ఇచ్చి నా.. బ్యాంకులు పంట రుణాలిస్తున్నా.. కేవలం వాన లోటు కారణంగానే పంటలన్నీ సాగులోకి రాలేదు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద నీటితో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. దీంతో వరి సాగు కోసం జలాశయాల నుంచి కాలువలకు జలవనరుల శాఖ నీరు వదులుతోంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఈ సీజన్‌లో 14.87 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటికి 3.19 లక్షల హెక్టార్లలో నారు-నాట్లు పడాల్సి ఉంది. నీటి విడుదల వల్ల 3.21 లక్షల హెక్టార్లలో ఇప్పటికే నాట్లు పడ్డాయి. రాగులు, జొన్న, సజ్జ, మొ క్కజొన్న, ఇతర చిరుధాన్యాలు మూడోవంతు (62 వేల హెక్టార్లు) మాత్రమే సాగయ్యాయి. మినుము, పెసర, కంది, ఉలవ వంటి అపరాల సాగు కేవలం 55 వేల హెక్టార్లు, వేరుశనగ సహా నూనె గింజల పంటల సాగు 73 వేల హెక్టార్లకే పరిమితమయ్యా యి. పత్తి పంట 2.03 లక్షల హెక్టార్లే సాగులోకి వచ్చింది.
7 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం
పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 60 నుంచి 99 శాతం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వాన లోటు ఉంది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో వర్షపాతం సాధారణంగా ఉంది. శుక్రవారం నుంచి రానున్న వారం రోజులు అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా వర్షాలు విస్తారంగా కురిస్తే.. పంట కాలం కొంత తగ్గినా.. రైతులు వీలైన పంటలు వేస్తే.. నవంబరులోగా పంట చేతికొచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
Updated Date - Jul 18 , 2025 | 03:16 AM