Guntur court: గుంటూరు కోర్టులో పీఎస్ఆర్ కు ఎదురుదెబ్బ
ABN, Publish Date - Jun 27 , 2025 | 04:27 AM
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీసర్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
రఘురామ టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
గుంటూరు, అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను గుంటూరు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు కొట్టివేసింది. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన సమయంలో అప్పటి సీఐడీ డీఐజీ మేకావత్ సునీల్ కుమార్‌నాయక్ కూడా అక్కడ ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన పేరును సీడీ ఫైల్లో చేర్చారు. సునీల్ నాయక్‌ను జగన్ ప్రభుత్వం ఒడిసా నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా నియమించింది. డిప్యుటేషన్ పూర్తయ్యాక ఆయన అక్కడకు వెళ్లిపోయారు. రఘురామ టార్చర్‌లో తన పాత్ర ఉందని పోలీసులు గుర్తించడంతో ఆయన ఒడిసా హైకోర్టు(కటక్)లో పిటిషన్ దాఖలు చేసి.. గతనెల 9న ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నారు.
ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర ఉందని.. ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ప్రొటెక్షన్ ఆర్డర్‌ను రద్దుచేయాలని దర్యాప్తు అధికారి అయిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇప్పటికే ఆ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు.. ముందస్తు బెయిల్ కోసం పీఎ్‌సఆర్ గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి గురువారం పీఎస్ఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలిచ్చారు.
గ్రూప్-1 కేసులో బెయిల్ పొడిగింపు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలకు పాల్పడడంతోపాటు నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులు మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మరో రెండు నెలలు పొడిగించింది. కాగా, ఇదే కేసులో బెయిల్ కోరుతూ క్యామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ (ఏ2) వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు.
పిటిషనర్ గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జైలు అధికారులు ఎలాంటి వైద్యం అందించడం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు పిటిషనర్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, నివేదికను కోర్టు ముందు ఉంచాలని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. విచారణను జూలై 1కి వాయిదా వేశారు.
Updated Date - Jun 27 , 2025 | 11:21 PM