ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram Project: పోలవరం చకచకా

ABN, Publish Date - Jun 26 , 2025 | 04:00 AM

జగన్‌ ఐదేళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఒక్క పనీ జరుగక యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. ప్రాజెక్టును చూసేందుకు రానిచ్చేవారే కాదు.. ఎలాగోలా వెళ్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనేది.

  • 2027 డిసెంబరుకల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులన్నీ వేగవంతం

  • గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌.. గ్యాప్‌-1లో ఈసీఆర్‌ఎఫ్‌ పునాది పనులు

  • ఈ వారాంతానికి డిజైన్లు ఆమోదించనున్న కేంద్ర జలసంఘం

  • నవంబరు 1 నుంచి ‘ఎర్త్‌ కమ్‌ రాక్‌’ పనులు.. ప్రాజెక్టు ప్రధాన

  • పనులు 76.43ు పూర్తి.. ఎడమ కాలువ 74.43 శాతం

  • అటు విద్యుత్కేంద్రం పనులూ వేగవంతం.. ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. పాపికొండల మధ్య గోదావరి.. ప్రాజెక్టు చుట్టూ కొండలు.. పచ్చని వాతావరణం.. స్పిల్‌ వే నుంచి రాజమండ్రి వైపు నీటి ప్రవాహం.. ఎగువ కాఫర్‌ డ్యాం.. స్పిల్‌వే రోడ్డుతో పోలవరం, తూర్పుగోదావరి వైపు రాకపోకలకు మార్గం.. స్పిల్‌వేను ఆనుకుని ఉన్న కొండ దిగువన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైపు గోదావరిలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం మధ్య ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌-2లో చకచకా సాగుగున్న డయాఫ్రం వాల్‌ పనులు.. దానిని ఆనుకుని గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీచేసిన అంగుళూరులో ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌-1లో పునాది పనులు.. దానికి ఎదురుగా జోరుగా సాగుతున్న విద్యుత్కేంద్రం పనులు.. ఎదురుగా కొండల్లో పోలవరం ఎడమ రఽపధాన కాలువ టన్నెల్‌ నిర్మాణం.. అన్నిటినీ మించి భారీ యంత్రాలు, వాహనాల రాకపోకల సందడి.. వీటన్నిటితో పోలవరం బహళార్థ సాధక ప్రాజెక్టు కళకళలాడుతోంది. దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యక్ష పరిశీలన ఇదీ..

రాజమహేంద్రవరం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):జగన్‌ ఐదేళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఒక్క పనీ జరుగక యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. ప్రాజెక్టును చూసేందుకు రానిచ్చేవారే కాదు.. ఎలాగోలా వెళ్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనేది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ ఘోరపరాజయం.. టీడీపీ కూటమి ఘనవిజయంతో చంద్రబాబు మరోసారి సీఎం పదవి చేపట్టి మళ్లీ ప్రాజెక్టుకు ప్రాణంపోశారు. ప్రాజెక్టును 2027 డిసెంబరునాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలన్న ఆయన మార్గనిర్దేశంతో.. పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం తమ ఉనికినే త్యాగం చేసి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కూడా ఈలోపే పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం డిజైన్లను కేంద్ర జలసంఘం ఈ వారాంతానికి ఆమోదించే అవకాశం ఉందని పోలవరం ఎస్‌ఈ రామచంద్రరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. నవంబరు 1 నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.

ఎడమ కాలువ పనులు కూడా

ఇప్పటికే పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు సుమారుగా పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో 8 ప్యాకేజీల కింద విభజించి పనులు చేస్తున్నారు. అయితే చిన్న చిన్న భూసేకరణ సమస్యలు, కొండలు తొలచడం, ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖకు ప్రస్తుతం నీరు పంపించడం వల్ల అక్కడ పనులకు కాస్త ఇబ్బంది ఉంది. ఈ కాలువను పూర్తి చేసి పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీటిని ఈ కాలువలోకి తోడి, అక్కడి నుంచి విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందివ్వాలనేది లక్ష్యం.

6,779 కుటుంబాలకు పునరావాసం..

ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గత ఏడాది డిసెంబరు నాటికి 14,662 కుటుంబాలకు పునరావాసం కల్పించగా.. ఈ ఏడాది మార్చికల్లా 21,441 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేశారు. మరో 6,779 కుటుంబాలకు సంబంధించిన పునరావాస ప్రక్రియ నడుస్తోంది. ఇంకా 16,619 కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 26 కాలనీలు పూర్తి చేశారు. మరో 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. అక్కడ పనులు సరిగా జరుగలేదని కాంట్రాక్టు రద్దు చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకూ 14,369 కుటుంబాలను ఆయా పునరావాస కాలనీలకు తరలించారు. ఇంకా 6,577 కుటుంబాలను తరలించాల్సి ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, దేవీపట్నం మండలాల్లో పునరావాస సమస్యలు 30 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నాయి. చింతూరు, కేఆర్‌ పురం ఐటీడీఏల పరిధిలోని 48 గ్రామాలకు చెందిన 17,114 కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేయడానికి ముసాయిదా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అందులో 8 గ్రామాలకు పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు.

వేగంగా డయాఫ్రం వాల్‌ పనులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి పోలవరం, ఉమ్మడి తూర్పు గోదావరి దేవీపట్నం, అంగుళూరు గ్రామాల మధ్య గోదావరి నదిలోనూ, అంగుళూరు గ్రామాన్ని ఖాళీ చేసిన ప్రాంతంలోనూ మొత్తం 2,196 మీటర్ల పొడవున ప్రధాన డ్యాం అయిన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంను నిర్మించనున్నారు. ఎడమ వైపు గ్యాప్‌-1, కుడి వైపు గ్యాప్‌-2గా విభజించారు. స్పిల్‌వేకు సమీపంలోని గ్యాప్‌-3 నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. ప్రస్తుతం గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. సుమారు 15 భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి. వాల్‌ మొత్తం పొడవు 1,396.6 మీటర్లు. ఇప్పటి వరకూ 570 మీటర్ల పని పూర్తయింది. రాక్‌ఫిల్‌ వర్క్‌ నడుస్తోంది.

పవర్‌ ప్రాజెక్టు పనులూ చురుగ్గా

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి విద్యుత్కేంద్రాన్ని కూడా పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 50 శాతం సివిల్‌ వర్క్‌ జరిగింది. గోదావరి ఒడ్డున అంగుళూరులోని పెద్దకొండలు తొలిచి 12 టర్బయిన్లు నిర్మించారు. వీటికి ఇప్పటికే లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. మిగతా ఐరన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ టర్బయిన్ల వెనుక వైపున ఒక్కో టర్బయిన్‌కు ఒక్కో యంత్రం బిగిస్తారు. విద్యుత్కేంద్రానికి అవసరమైన సామగ్రి కోసం రెండు పెద్ద స్టోర్లు నిర్మిస్తారు. అధికారుల కోసం పెద్ద హోటల్‌ తరహాలో వసతి గృహాన్ని ఇప్పటికే నిర్మించారు.

ఇదీ పనుల పురోగతి..

ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా 60 శాతం పనులు జరిగాయి. హెడ్‌వర్క్స్‌ 76.43 శాతం పూర్తయ్యాయి. సివిల్‌ వర్క్‌ 78.56 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 92.75 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 74.43 శాతం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు 25.11 శాతం పైగా జరిగాయి.

స్పిల్‌వే నుంచి18,414 క్యూసెక్కుల నీరు..

స్పిల్‌వే ఇప్పటికే పూర్తి కావడంతో బుధవారం దీని గుండా రాజమండ్రి మీదుగా ధవళేశ్వరం బ్యారేజీ వైపు 18,414 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు కాఫర్‌ డ్యాంల నడుమ 15.45 మీటర్ల నీటమట్టం నమోదైంది. స్పిల్‌ వే ఎగువన 25.8 మీటర్లు, స్పిల్‌వే దిగువన 15.45 మీటర్లు, ఎగువ కాఫర్‌ డ్యాంకు ఎగువన 13.99 మీటర్ల నీటి మట్టం నమోదైంది.

Updated Date - Jun 26 , 2025 | 05:56 AM