CPI Ramakrishna : పాలన వదిలేసిన పవన్‌కు డిప్యూటీ సీఎం పదవెందుకు?
ABN, First Publish Date - 2025-02-16T05:11:23+05:30
పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు.
గుళ్లు, గోపురాలకు తిరుగుతున్న ఆయనకు దేవదాయ శాఖ ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ
అనంతపురం విద్య, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్.. కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? కేబినెట్‌లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం ఏమిటి’ అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి, గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లను కట్టబెడితే.. మాట్లాడకుండా అదానీకి ఊడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు.
Updated Date - 2025-02-16T05:11:25+05:30 IST