Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - May 22 , 2025 | 03:05 PM
రాష్ట్రంలో నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని.. ఒక పార్టీనో, ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు.
విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్, పుస్తక రచయిత డా. M C నాయక్.
అనంతరం డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరికీ ప్రకృతి నుంచీ తీసుకోవడమే కానీ ప్రకృతికి ఇవ్వడం అలవాటు లేకుండా పోయిందన్నారు. కానీ ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని అన్నారు. తన 8 ఎకరాల పొలంలో దున్నడం మానేసి, అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. మన ఇంట్లో మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం పెడితే ఎంత బలంగా పని చేస్తుందో చూడాలన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని అయితే వనజీవి రామయ్య తన జీవితంతో ఏకంగా లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.
మనందరి బాధ్యత
సహజంగా ఏర్పడిన మడ అడవులు సముద్రం దగ్గర ఉంటూ మనలని రక్షిస్తాయన్నారు.అయితే, ఇటీవల మడ అడవులను కూడా నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను చిన్నపుడు స్కూలులో చూసిన చెట్టును కొట్టేసిన ఘటన తనకు మొక్కలు పెంచే ఆలోచన తెచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. చదువుకున్న మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని.. ఒక పార్టీనో, ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు. మన అవసరాలకు ముందుగానే పది చెట్లు నాటి ఉంచాలన్నారు. మన పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తుచేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని అన్నారు. జంతుజాలం మన అన్నదమ్ములని, మనం మన రూట్స్ తెలుసుకోవాలని ప్రవర్తించాలని అన్నారు. చిన్న మార్పు చాలా పెద్ద మార్పులకు దారి తీస్తుందని, ప్రకృతిపై మనిషి చేసే యుద్ధం ఎలా ఉందో తెలుసన్నారు.
అడవులను నాశనం చేస్తున్నారు
తూర్పు కనుమలలో శేషాచలం, నల్లమల, పాపికొండలు మనకు ఇంకా ఉన్నాయని, అయితే, నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్ ని ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ విద్యా కేంద్రాలుగా బయోడైవర్సిటీ పార్క్ ఉంటుందని తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ ఒక పల్లెవనం ఉండాలని, వందల ఎకరాలు ఇచ్చేస్తున్నాం కానీ బయోడైవర్సిటీకి కేటాయించడం లేదని వ్యాఖ్యానించారు. మంగళగిరి చూస్తే చాలా బాగుంటుందని, నర్సరీలు పెంచేటప్పుడు అటవీశాఖ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. కడియం నర్సరీలు కోనాకార్పస్ అమ్మకాలు ఆపడం గురించి ఆలోచించాలన్నారు. పక్షలు కూడా ఉండలేని మొక్కలను ఎలా అమ్ముతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Also Read:
AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Doctor Fears Job Loss: నా జాబ్ పోవడం పక్కా.. ఇక రెస్టారెంట్‌లో పని చేసుకోవడమే.. డాక్టర్ పోస్టు వైరల్
For More Telugu And National News
Updated Date - May 22 , 2025 | 03:08 PM