Doctor Fears Job Loss: నా జాబ్ పోవడం పక్కా.. ఇక రెస్టారెంట్‌లో పని చేసుకోవడమే.. డాక్టర్ పోస్టు వైరల్
ABN , Publish Date - May 22 , 2025 | 01:58 PM
ఏఐ సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయిన ఓ డాక్టర్ ఇక తన జాబ్ పోవడం పక్కా అంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత కచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేసిన ఏఐ సాంకేతికతను చూసి ఓ డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఇలాగైతే తనకు జాబ్ పోవడం పక్కా అంటూ కామెంట్ చేశారు. డా. మొహమ్మద్ ఫావ్జీ ఖత్రాంజీ పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఊపిరితిత్తుల ఎక్స్‌రేను పరిశీలించేందుకు ఉద్దేశించిన ఓ ఏఐ టూల్ చేసిన అద్భుతం చూసి ఆయన ఈ కామెంట్ చేశారు. కేవలం సెకెన్ల వ్యవధిలోనే ఏఐ టూల్ ఓ ఎక్స్‌రే ఫిల్మ్‌ను పరిశీలించి రోగం ఏంటో కనిపెట్టేసిందని అన్నారు. తాను గుర్తించని అంశాలను కూడా హైలైట్ చేసిందని చెప్పుకొచ్చారు. అంతిమంగా, పేషెంట్‌కు సరైన వైద్యం అంది కోలుకున్నారని కూడా తెలిపారు.
‘‘ఇలాగైతే నా జాబ్ పోయినట్టే, ఎక్స్ రే ఫిల్మ్‌ను చూసి రోగం ఏంటో చెప్పే నైపుణ్యాన్ని సాధించేందుకు నాకు 20 ఏళ్లు పట్టింది. కానీ ఇదే ఎక్స్ రే ఫిల్మ్‌ను ఏఐ టూల్ సెకెన్ల వ్యవధిలోనే అర్థం చేసుకుని రోగం ఏంటో చెప్పేసింది. ఇకపై ఎక్స్ రేలను నిపుణులు పరిశీలించాల్సిన అవసరం లేదు. ఏఐ సరిపోతుంది. ఇక నేను వెళ్లి మెక్‌డోనల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో జాబ్ వెతుక్కుంటాను. నాకు అక్కడ జాబ్ దొరక్కపోదు’’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. మరికొందరు మాత్రం కాస్తంత విభేదించారు. ఏఐతో డాక్టర్ల పని మరింత సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. మనుషులకు ఉండే సహజసిద్ధమైన నిర్ణయాత్మక శక్తి ఏఐకి లేదని అన్నారు. కాబట్టి, ఏఐ ఎప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాదన్నారు.
‘‘ఏఐ కారణంగా వైద్యులు ఒక్క రోజులో ఎక్కువ మంది రోగులను పరీక్షించే అవకాశం ఉంది. దీని వల్ల డాక్టర్ వృత్తికి నష్టమేమీ ఉండదు’’ అని అన్నారు.
అయితే, ఏఐ రాకతో కొన్నేళ్ళ తరువాత డాక్టర్ల అవసరం ఉండదని కూడా బిల్ గేట్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏఐ అభివృద్ధి అవుతున్న తీరు చూసి ఆయన ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మనం చూస్తున్న అనేక సేవలు చాలా చవకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు.
ఇవి కూడా చదవండి:
పనిలో టాలెంట్ చూపించారని ప్రమోషన్ నిరాకరణ.. నెట్టింట ఉద్యోగి ఆవేదన
పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో
రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..
25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగి తొలగింపు.. మైక్రోసాఫ్ట్‌పై బాధితుడి భార్య ఫైర్