Denied Promotion: పనిలో టాలెంట్ చూపించారని ప్రమోషన్ నిరాకరణ.. నెట్టింట ఉద్యోగి ఆవేదన
ABN , Publish Date - May 22 , 2025 | 12:17 PM
గొప్పగా పనిచేసినందుకు ఓ ఉద్యోగికి ప్రమోషన్ దక్కని ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ ఉద్యోగి అయినా తన పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ప్రమోషన్లు, జీతభత్యాలు పెరగాలని ఆశిస్తారు. వీటి కోసం అహరహం శ్రమిస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఉద్యోగి కూడా ఇదే రీతిలో కష్టించి పని చేశారు. తన పనితీరుతో అందరినీ మెప్పించారు. ప్రమోషన్‌కు అవకాశం ఉందని తెలిసి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ, ప్రమోషన్ ఇచ్చేది లేదని సంస్థ పేర్కొంది.. బాగా పని చేస్తున్నందుకే ప్రమోషన్ ఇవ్వట్లేదని కూడా చెప్పడంతో సదరు ఉద్యోగి షాకైపోయారు. అసలేం జరిగిందీ చెబుతూ ఆ ఉద్యోగి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
రెడిట్‌లో సదరు ఉద్యోగి ఈ విషయాలను పంచుకున్నారు. ‘‘అద్భుతంగా పనిచేస్తున్నందుుకు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. సిటీ రికార్డ్స్ ఆఫీసులో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నా. డేటాబేస్ మేనేజ్‌మెంట్, ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వడం నా విధులు. కొత్త ఉద్యోగులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఈ సందర్భంగా మా కంపెనీలో ప్రమోషన్ ఉన్నట్టు తెలిసింది. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఇన్నేళ్ల అనుభవం అక్కరకు వస్తుందని అనుకున్నాను. కానీ ఊహించని ఫలితం వచ్చింది’’
‘‘అక్కడ నేనే అత్యంత సీనియర్ ఉద్యోగిని. మేనేజర్‌కు ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తాను. సిస్టమ్ ఏదైనా క్రాష్ అయితే మొదట ఫోన్ చేసేది నాకే. ఇక ఇంటర్వ్యూ కూడా బాగానే జరిగింది. కానీ ప్రమోషన్ మాత్రం రాలేదు. ఎందుకిలా అని మా మేనేజర్‌ను అడిగా. ప్రస్తుతం నేను నా బాధ్యతలను అత్యద్భుతంగా నిర్వహిస్తున్నానట. నాకు ప్రమోషన్ వస్తే ప్రస్తుత స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరూ లేరట. కంపెనీకి ఇబ్బందులు వస్తాయట. అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వలేదట. అసలు నాకు జీవితంలో ఎదిగే అవకాశం హక్కు లేదా’’ అని సదరు ఉద్యోగి ప్రశ్నించారు. తాను శిక్షణ ఇచ్చిన మరో ఉద్యోగికి ఆ ప్రమోషన్ దక్కిందని కూడా వాపోయారు.
‘‘నేనేమీ తిరుగుబాటు లేవనెత్తట్లేదు. రాజీనామా కూడా చేయట్లేదు. ఎప్పటిలాగే నా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆఫీసుకు వచ్చి వెళుతున్నా. బాగా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు’’ అని వాపోయారు. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కెరీర్‌లో ఎదగాలంటే కొత్త సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించడం మినహా మరో మార్గం లేదని జనాలు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో
రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..
25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగి తొలగింపు.. మైక్రోసాఫ్ట్‌పై బాధితుడి భార్య ఫైర్