Bengaluru: రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - May 17 , 2025 | 10:38 PM
అపార్ట్‌మెంట్ కారిడార్‌లో షూ ర్యాక్ తొలగించని ఓ ఫ్లాట్ ఓనర్ చివరకు రూ.15 వేల జరిమానా చెల్లించారు. బెంగళూరులో ఈ ఉదంతం వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అపార్ట్‌మెంట్‌లో తన ఫ్లాట్ ముందున్న కారిడార్‌లో చెప్పుల ర్యాక్ పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు రూ.15 వేల ముందస్తు జరిమానా చెల్లించాడు. చెప్పుల ర్యాక్ తీయనని మాత్రం స్పష్టం చేశాడు. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికంగా ఉన్నా ఓ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. సదరు ఫ్లాట్ యజమాని ఉంటున్న బ్లాక్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. దీని ప్రకారం, అపార్ట్‌మెంట్‌లో కారిడార్లు వంటి అందరూ వాడే ప్రాంతాల్లో చెప్పుల ర్యాక్స్, పూలకుండీలు వంటివేవీ ఉంచకూడదు. అగ్నిప్రమాదాల సందర్భంలో సహాయక చర్యలకు ఇవి అడ్డంకిగా మారతాయనే ఉద్దేశంతో అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్లాట్‌ల యజమానులందరూ ఈ నిబంధనలకు అంగీకరించారు. రెండు నెలల ముందే వారికి ఈ విషయమై అసోసియేషన్ సమాచారం ఇచ్చింది. మొదట్లో కొద్ది మంది వీటిని తొలగించారు. ఆ తరువాత పరిస్థితిని అర్థం చేసుకుని మిగతా వారు కూడా షూ ర్యాక్స్‌ను తమ ఫ్లాట్‌లో పెట్టుకున్నారు.
కానీ ఓ ఫ్లాట్ యజమాని మాత్రం ఇందుకు ససేమిరా అన్నారు. పైపెచ్చు, రోజువారీ జరిమానాకు అనుగూణంగా రూ.15 వేల ముందస్తు చెల్లింపులు కూడా చేసేశారు. ఈ విషయంలో మరోసారి తనను ఇబ్బంది పెట్టొద్దని కూడా స్పష్టం చేశారు. దీంతో, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు ఏం చేయాలో పాలు పోని స్థితి వచ్చింది. ప్రస్తుతం కారిడార్‌లో ర్యాక్ పెట్టుకున్న వారిపై రోజుకు రూ.100 జరిమానా విధిస్తున్నారు. దీన్ని రూ.200లకు పెంచేందుకు ట్రై చేస్తున్నారు.
‘‘కామన్ ఏరియాలు వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఈ విషయంలో అధిక శాతం మంది ఒప్పుకున్నా ఒక వ్యక్తి మాత్రం ససేమిరా అన్నారు’’ అని అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో
ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు
నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు