Bengaluru Molestation Incident: నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు
ABN , Publish Date - May 03 , 2025 | 07:40 AM
బెంగళూరు ఘటనలో ఆకతాయి నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళ తాజాగా మీడియా ముందుకొచ్చింది. సమాజంలో మార్పు రానంత వరకూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బెంగళూరులో పోకిరీల చేతిలో వేధింపులకు గురైన ఓ మహిళ తన ఆవేదన వెళ్లబోసుకుంది. పోకిరి తనను నడిరోడ్డు మీద వేధిస్తున్నా అతడిని నిలువరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో, ప్రజల్లో మానసికమైన మార్పు రావాలని చేసింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని కూడా చెప్పింది.
‘‘ఎకోపార్క్ వరల్డ్‌లో బుధవారం రాత్రి 11.30 గంటలకు నేను వాకింగ్ చేస్తుంటే వెనక నుంచి ఎవరో వీపుపై ఎవరో కొట్టినట్టు అనిపించింది. ఎవరో ఇష్టారీతిని డ్రైవ్ చేస్తూ నన్ను తగిలారని అనుకున్నా. రెండోసారి ఇలాగే జరిగితే కాస్తంత షాకయ్యా. మరోసారి ఇలాగే జరిగింది. ఎవరో కావాలనే నన్ను వేధిస్తున్నారని అర్థమైంది. వెంటనే అక్కడున్న వారిని సాయం చేయమని కోరా.. ఆటో డ్రైవర్లను, ఇతర వాహనదారులను ఆపా.. కానీ ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు’’
‘‘ఆ తరువాత ఎకోవరల్డ్‌లో ఉన్న ఓ సెక్యూరిటీ బూత్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాను. వారు సాయం చేశారు. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వయంగా డీసీపీ, ఏసీపీ రంగంలోకి దిగారు. విచారణ జరుగుతోంది. నన్ను వేధించిన నిందితుడు అరెస్టు అవుతాడని ఆశిస్తున్నా. ఇలాంటి వాళ్లు తప్పించుకుంటే ఇతరులకూ తప్పు చేసే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది’’
‘‘ఇలాంటి ఘటనలకు ఎవరినో నిందించడం సరికాదు. జనాలే ఇలాంటి ఘటనలకు బాధ్యత తీసుకోవాలి. ‘‘రేపు నాకు కుమారుడే ఉండి ఉంటే అతడికి స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో చెబుతా. ఎందుకంటే మగాళ్లల్లో ఈ తరహా ప్రవర్తన మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. కొందరు మహిళలు కూడా ఫెమినిజం పేరిట ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి, ఇది చట్టాలను, వ్యక్తిగత పరిధులను గౌరవించడానికి సంబంధించిన అంశం’’ అని ఆమె అన్నారు.
‘‘ఇన్ని సీసీటీవీ కెమెరాలు, పటిష్ఠమైన నిఘా ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం నిజంగా ఆశ్చర్యకరం. ప్రజల మనసుల్లోనే అసలు సమస్య ఉందని ఈ విషయం తెలియజేస్తోంది. అయితే, నేను ఈ ఘటనలో బాధితురాలిని కాను. తప్పు చేసిన వ్యక్తే అసలైన బాధితుడు. ఒకరిని వేధించి ఆనందించే వారి మానసిక స్థితి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనల్లో మహిళలు అవమానంగా భావించి తెర వెనుక దాక్కోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకొచ్చి పోరాడాలి’’ అని ఆమె తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..