Panchayat Funds Scam: పంచాయతీ నిధులు హాంఫట్
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:26 AM
గత వైసీపీ హయాం అంతా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపిస్తూ సర్పంచ్‌లు నిరసనలకు దిగగా.. మరోవైపు ఆదాయార్జన గల గ్రామ పంచాయతీల్లో నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి.
100కు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో ఐదేళ్లుగా దోపిడీ
కోట్లలో అక్రమాలు
కొన్నిచోట్ల చేపట్టిన ఆడిట్‌లో వెల్లడి
వైసీపీ సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులు.. అంతా కలసి దోపిడీ
నిజాయితీ ఆడిట్ అధికారులను బదిలీ చేయిస్తున్న వైనం
పట్టణ ప్రాంతాల సమీపంలో కార్యదర్శుల పోస్టులకు గిరాకీ
వైసీపీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న పలు పంచాయతీలు, వైసీపీ నేతల గుప్పిట్లో ఉన్న మరికొన్ని రిజర్వుడ్ పంచాయతీల్లో ఐదేళ్లపాటు యథేచ్ఛగా నిధులను స్వాహా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పన్నులు, సొంత వనరుల ద్వారా రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే 100కు పైగా మేజర్ పంచాయతీల్లో భారీ స్కామ్‌కు తెరదీశారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు అంతా కలిసి రూ.వందల కోట్ల నిధులు మాయం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల అక్రమాలు జరిగినట్టుగా ఆడిట్‌లో వెల్లడైంది.
మేజర్ పంచాయతీల్లో పారిశుధ్యం పనులను అడ్డం పెట్టుకుని భారీగా నిధులు దండుకున్నారు. నిర్మాణ పనుల్లో ఏఈలను వాడుకుని ఎంబుక్‌ల్లో రికార్డు చేయకుండానే స్వాహా చేశారని చెప్తున్నారు. మీటింగ్‌లు పెట్టకుండానే అజెండాలో లేని పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి మరీ దోచుకున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ హయాం అంతా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపిస్తూ సర్పంచ్‌లు నిరసనలకు దిగగా.. మరోవైపు ఆదాయార్జన గల గ్రామ పంచాయతీల్లో నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోకి విలీనం చేయడంతో కోర్టుల ఆదేశాలతో దశాబ్దాలుగా కార్యదర్శుల ఏలుబడిలో పాలకవర్గాలు లేకుండా ఉన్న పంచాయతీలు, సహజ వనరులున్న, నగరాల పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా జరుగుతున్న పంచాయతీల్లో నిధులు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా మేజర్ పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అవినీతిని ప్రశ్నించేందుకు సాహసించని టీడీపీ కార్యకర్తలు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, అధికారులపై ఫిర్యాదులు చేశారు. డీపీఓలు, డీఎల్‌పీఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన స్కామ్‌లపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు నివేదిక అందించారు.
అయితే ఇంకా కొంత మంది డీపీఓలు, డీఎల్‌పీఓలు అక్రమాలను కప్పిపుచ్చి కమిషనరేట్‌కు పక్కా సమాచారం అందించలేదన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పనిచేసిన ఓ పంచాయతీ కార్యదర్శి అదే మండలంలోని కృష్ణంపల్లిలో జరిగిన పనులకు ఉదయగిరి పంచాయతీ నిధుల నుంచి బిల్లులు డ్రా చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు కమిషనరేట్‌కు సమాచారం అందించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. ఇలా వైసీపీ హయాంలో కార్యదర్శులను చెప్పుచేతుల్లో పెట్టుకుని భారీగా నిధులు వాడేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిధులు లేవంటూనే దోపిడీ
గత ప్రభుత్వంలో ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో ఆయా పంచాయతీలకు వచ్చిన సొంత వనరుల ఆదాయాన్ని లెక్కా పక్కా లేకుండా తినేశారని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఏ పనులు చేపట్టాలన్నా వర్క్ కమిటీలు వేయాలి. రాష్ట్రంలో ఆ సంప్రదాయాన్ని గత ఐదేళ్లూ తుంగలో తొక్కారు. థర్డ్ పార్టీకి బిల్లులు చెల్లించిన కొందరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండై కార్యాలయాల చుట్టూ, నేతల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో ఏ వస్తువైనా కొనాలంటే రూ.50 వేలకు పైబడి కొనుగోళ్లకు టెండర్లు పిలవాలి. కానీ ఎక్కడా టెండర్లు జరిగిన దాఖలాల్లేవు. ఇష్టమొచ్చినట్లు షాపుల్లో బిల్లులు తెచ్చి పెట్టారు.
సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులకు తనిఖీ ఏదీ?
గతంలో ట్రెజరీ ద్వారా బిల్లులు సమర్పించి, ట్రెజరీ అధికారులు సరిచూసుకుని బిల్లులు విడుదల చేసేవారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ట్రెజరీల నుంచి తప్పించి సీఎ్‌ఫఎంఎస్ ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని మేజర్ పంచాయతీల్లో కార్యదర్శులు ఏవేవో బిల్లులు పెట్టి మరీ డ్రా చేస్తున్నారు. కొన్ని సార్లు విడ్డూరంగా వైట్‌పేపర్ పెట్టి మరీ సీఎ్‌ఫఎంఎస్ ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నారు. సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్ చేసే వాటిని తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో పంచాయతీలు ఇష్టారీతిగా డబ్బులు డ్రా చేస్తున్నాయి. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తేనే సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్ చేసిన బిల్లులను పరిశీలిస్తున్నారు. లేకపోతే వాటిని పరిశీలించే వ్యవస్థ గ్రామ పంచాయతీల్లో లేదు. మున్సిపాలిటీల్లో డబ్బులు డ్రా చేయాలంటే ముందుగా ప్రీ ఆడిట్ చేస్తారు. గ్రామ పంచాయతీల్లో అలాంటి విధానం లేకపోవడంతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. స్టాక్ రిజిస్టర్లు పెట్టకుండానే, కొనుగోలు చేసిన వాటిని నమోదు చేయకుండానే డబ్బులు డ్రా చేస్తున్నారు. బ్లీచింగ్ తదితర వస్తువులు కొనుగోలు చేయాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. అయితే ఎక్కడా ఆ విధానాన్ని పాటించడం లేదు.
నిజాయితీగా పనిచేస్తే బదిలీయే
వార్షిక ఆడిట్‌లో పంచాయతీ ఆడిట్ అధికారులు సాధారణంగా అక్రమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఆడిటర్లకు పర్సంటేజీలు ఇస్త్తే చాలు, ఏదైనా ఓకే చేసే పరిస్థితి గ్రామ పంచాయతీల్లో ఉంది. కొన్ని చోట్ల నిజాయితీ గల అధికారులు పక్కాగా ఆడిట్ చేస్తే వారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆడిట్ అధికారిణి పద్మజారాణి ఉదంతమే ఇందుకు నిదర్శనం. 90 పంచాయతీల్లో ఆడిట్‌ను తిరిగి సమీక్షించాలని ఆమె నిర్ణయించగా, అక్కడ పనిచేసే కార్యదర్శులు అడ్డుకున్నారు. లోపభూయిష్ట ఆడిట్‌ను సమీక్షించాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. ఇటీవల పద్మజారాణి స్వయంగా హుకుంపేట పంచాయతీలో తనిఖీ చేస్తే రూ.4 కోట్లు అవినీతి జరిగిందని తేలింది. అంతకుముందు వేమగిరి పంచాయతీలో సమీక్షిస్తే రూ.కోటికిపైగా అవినీతి జరిగినట్లు నివేదిక ఇచ్చారు. పద్మజారాణి ఆడిట్ తనిఖీలను పునఃసమీక్ష చేపట్టడంతో ఆర్థిక శాఖ అధికారులు ఆమెను బదిలీ చేశారు. మరో అధికారిని అక్కడ నియమించారు. గతంలో కూడా పద్మజారాణి నిజాయితీని తట్టుకోలేని కొందరు ఆమెను బదిలీ చేయించారు. అయితే ఆమె అప్పట్లో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇప్పుడు ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా, ఆమె స్థానంలో సుబ్బారెడ్డి అనే అధికారిని సాధారణ బదిలీ ప్రక్రియలో నియమించారు.
పంచాయతీ కార్యదర్శులకు గిరాకీ
సొంత ఆదాయం కలిగిన పంచాయతీల్లో పనిచేసే కార్యదర్శులకు గిరాకీ పెరిగింది. ఇలాంటి పలు పంచాయతీల్లో ఏదో ఒక నెపంతో ఎన్నికలు నిర్వహించకుండా కొందరు అడ్డుకుంటున్నారు. రాజమండ్రి చుట్టూ ఉన్న 21 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ పోస్టింగ్ కోసం ఉన్నతాధికారులకు, నేతలకు కార్యదర్శులు పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ సంస్కరణల్లో భాగంగా రూ.కోటికి పైగా ఆదాయం కలిగిన పంచాయతీలకు అధికారిగా డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. దీంతో పలుచోట్ల ఎంపీడీఓ పోస్టు కంటే డిప్యూటీ ఎంపీడీఓ పోస్టు కోసం పలువురు ఎగబడుతున్నారు.
Updated Date - Jun 16 , 2025 | 03:31 AM