Minister Sanjay Rathod: మురళీనాయక్ బంజారాలకు గర్వకారణం
ABN, Publish Date - May 19 , 2025 | 05:00 AM
మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ వీరజవాన్ మురళీనాయక్ బంజారాల గర్వకారణమని తెలిపారు. ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి సహాయసహకారాలు అందించేందుకు హామీ ఇచ్చారు.
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన మహారాష్ట్ర మంత్రి
హిందూపురం, మే 18(ఆంధ్రజ్యోతి): వీరజవాన్ మురళీనాయక్ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలకు గర్వ కారణమని మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని వీరజవాన్ స్వగ్రామమైన కళ్లి తండాకు మంత్రి వచ్చారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్‌నాయక్, జ్యోతీబాయిని పరామర్శించారు. వీరజవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వీరజవాన్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..మురళీనాయక్ కుటుంబానికి బంజారాల అండ ఉంటుందన్నారు. మహారాష్ట్రలో మురళీనాయక్ జన్మించారు కాబట్టి అక్కడికి ఆయన తల్లిదండ్రులను తీసుకెళ్లి, ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తమ కుమారుడిని పరమవీరచక్రతో ప్రభుత్వం గుర్తించేలా బంజారాలు కృషి చేయాలని మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్‌నాయక్, జ్యోతీబాయి.. మంత్రిని కోరారు.
Updated Date - May 19 , 2025 | 05:01 AM