CM Chandrababu: గురువుల గౌరవం పెంచుతాం
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:23 AM
రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా శాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో....
గ్రామ ఆలయాల వంటివే ప్రభుత్వ బడులు
వాటిని తల్లిదండ్రులు, టీచర్లే కాపాడుకోవాలి
చదివిన బడికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వాలి
పీటీఎం 2.0 స్ఫూర్తి ఇదే.. పేరెంట్ కమిటీలు నా కల
ఆ కమిటీలను లోకేశ్ మరో ఎత్తుకు చేర్చారు
బ్యాగులు, పుస్తకాలపై నాడు నేతల ఫొటోలు
మరుగుదొడ్డి ఫొటోలు పంపాలని టీచర్లపై ఒత్తిడి
ఆ రోజులు పోయాయి.. ప్రభుత్వ బడిలో
‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టే పరిస్థితి తెచ్చాం
12 డీఎస్సీలు ఇచ్చాం.. తాజాగా మెగా డీఎస్సీ కూడా మా ఘనతే: సీఎం చంద్రబాబు
గురుపౌర్ణమి రోజున మెగా పీటీఎంతో గిన్నిస్ రికార్డు
‘‘గ్రామంలోని చిన్న ఆలయాన్ని ఊరంతా కలిసి కాపాడుకుంటుంది. పూజలు చేసి, భక్తి భావంతో గ్రామాన్ని కాపాడాలని గ్రామ దేవతను ప్రార్థిస్తుంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలలను కూడా కాపాడుకోవాలి. మన పిల్లలను తీర్చిదిద్ది, జ్ఞానాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు అవి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చ దివి, ఉన్నత స్థితికి చేరిన వారంతా, తాము చదువుకున్న పాఠశాలలకు చేయూతను ఇవ్వాలి. ఈ స్ఫూర్తిని తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల్లో నింపడమే పీటీఎం 2.0 లక్ష్యం.’’
- సీఎం చంద్రబాబు
అనంతపురం/పుట్టపర్తి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా శాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్తచెరువు స్కూల్ పరిసరాలను చూస్తుంటే తనకు మళ్లీ చదువుకోవాలని అనిపిస్తోందని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉందన్నారు. ‘‘ఆర్థిక ఇబ్బందులతోపాటు అనేక సవాళ్లు ఉన్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి.
అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఎన్ని కష్టాలు ఎదురైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసితీరుతాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖను లోకేశ్ అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎం గిన్నిస్ రికార్డు సృష్టిస్తోందన్నారు. 2.28 కోట్ల మంది మెగా పీటీఎంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ‘‘పీటీఎం కమిటీ నా కల. ఉమ్మడి ఏపీలో 1998లో పేరెంట్ కమిటీలు ఏర్పాటు చేశాను. లోకేశ్ ఈ కమిటీలను మరో ఎత్తుకు తీసుకువెళ్లారు. పాఠశాల పవిత్ర దేవాలయం మాత్రమే కాదు.. అవి ఆధునిక దేవాలయాలు కూడా. ఏ విద్యార్థీ తనకు చదువు చెప్పిన టీచర్‌ను మరిచిపోడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎకరా భూమి కొనిద్దామని కష్టపడుతూ, పిల్లల పర్యవేక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు’’ అని హితవు పలికారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
తల్లి పర్యవేక్షణలోనే లోకేశ్ చదువు..
‘‘నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఆ తర్వాత మంత్రి, ముఖ్యమంత్రిని కూడా అయ్యాను. ఆనాడు నా కుమారుడు లోకేశ్ చదువుతున్న స్కూల్, కాలేజీ పేరెంట్ మీట్‌లకు వెళ్లలేకపోయాను. నా భార్య భువనేశ్వరి అన్ని మీట్‌లకు వెళ్లేవారు. లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివేవరకూ ఆయన విషయాలు ఆమె ఒక్కరే పట్టించుకునేవారు. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఉండేవారు. చిన్నప్పుడు ఆరు కిలో మీటర్లు నడిచి బడికి వెళ్లాను. మా అమ్మ కట్టించిన క్యారియర్ తీసుకొని వాగులు, వంకలు దాటుకొని వెళ్లి క్లాసులకు హాజరయ్యేవాడిని.’’
ప్రభుత్వ బడిలో నో వేకెన్సీ బోర్డు.. గర్వకారణం
‘‘నేను మహిళా పక్షపాతిని. అన్ని కార్యక్రమాలు ఆడ బిడ్డలకే చేశాను. డ్వాక్రా సంఘాలు పెట్టి వారికి పొదుపు ఉద్యమం నేర్పించాను. నేను ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ఆడ బిడ్డల పట్ల కుటుంబాల్లో వివక్ష ఉండేది. మగ పిల్లవాణ్ణి చదివిస్తే, వాడే కుటుంబాన్ని చూసుకుంటాడని భావించేవారు. ఆడపిల్లకు వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపే పరిస్థితి ఉండేది. అందుకే ఆడబిడ్డల సంరక్షణ పథనం తీసుకువచ్చి, రూ.5వేలు జమ చేసి, ఆ డబ్బులను ఆడబిడ్డలు పెద్ద అయిన తర్వాత ఉపయోగించుకునేలా నేను అప్పట్లో ఏర్పాటుచేశాను. ఇప్పుడు మా ప్రభుత్వం తల్లికి వందనం పథకంతోపాటు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తీసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. నెల్లూరులోని ఒక ప్రభుత్వ స్కూల్‌లో నో వెకెన్సీ బోర్డు పెట్టడాన్ని చూసి గర్వపడ్డా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోలిస్తే... ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థవంతమైన టీచర్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో పుస్తకాలు, బ్యాగ్‌లపై తమ బొమ్మలు వైసీపీ నేతలు వేసుకున్నారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గంజాయికి విద్యార్థులు దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు.’’
12 సార్లు డీఎస్సీ నిర్వహించాం..
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ను కూడా నియమించకుండా, విద్యా సంస్కరణలు చేశామని ప్రచారం చేసుకున్నారు. టీచర్లు లేకుండా సంస్కరణలు ఎలావస్తాయి? తామే ఇంగ్లీష్ మీడియం పెట్టామని గొప్పలు చెప్పుకున్నారు. మరుగుదొడ్ల ఫొటోలు తీసి పంపించాలని టీచర్లపై ఒత్తిడి పెంచారు. కానీ మా ప్రభుత్వం గురువులకు గౌరవం పెంచుతుంది. సీఎం హోదాలో ఇప్పటివరకు 12 డీఎస్సీల ద్వారా 1.66 లక్షల మంది టీచర్లను నియమించాను. గతంలో విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇచ్చేవాళ్లం. రాబోవు రోజుల్లో ప్రతిభా అవార్డుల పథకాన్ని షైనింగ్ స్టార్స్‌కు వర్తింపజేసేలా విద్యాశాఖ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.
పాఠం చెప్పిన సీఎం చంద్రబాబు
విద్యార్థిగా మారిన విద్యా మంత్రి
విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం...
తండ్రి కంచం తీసిన లోకేశ్
విద్యార్థులు, తల్లులతో ముఖాముఖి
పుటపర్తి/ కొత్తచెరువు, జూలై10: నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు టీచరు అవతారం ఎత్తారు. కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అదే తరగతి గదిలో విద్యార్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూర్చుని ఆ పాఠాలు ఆలకించారు. ‘వనరులు’ అనే పాఠ్యాంశాన్ని సీఎం బోధిస్తుంటే, విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. అనంతరం వారికి ఏమాత్రం పాఠం అర్థమయిందో తెలుసుకునేందుకు ప్రశ్నలు వేసి ఆయన సమాధానాలు రాబట్టారు. అనంతరం పలువురు విద్యార్థుల ప్రోగ్రెస్ రికార్డులను సీఎం, మంత్రి పరిశీలించారు. మెగా పీటీఎం ముగిసిన అనంతరం చంద్రబాబు, లోకేశ్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తన తండ్రి ప్లేటు, తన ప్లేటు లోకేశ్ స్వయంగా తీశారు. అంతకుముందు.. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలకు చంద్రబాబు బస్సులో చేరుకున్నారు. ఆయన బస్సు దిగగానే లోకేశ్ వెళ్లి పాదాభివందనం చేశారు. కొత్తచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల టెన్త్ విద్యార్థులతో చంద్రబాబు, లోకేశ్ ఇష్టాగోష్టి నిర్వహించారు. విద్యార్థి మణికొండ సూర్యతేజ తాను చంద్రబాబుపై రాసిన కవితను చదివి వినిపించారు. విద్యార్థులతో ముఖాముఖీ సాగిందిలా..
సీఎం: ఎలా చదువుతున్నారు..? ఉపాధ్యాయులు పాఠాలు చక్కగా బోధిస్తున్నారా..?
విద్యార్థులు: బాగా చెబుతున్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం.
సీఎం: భవిష్యత్తులో మీరు ఏమవుతారు?
విద్యార్థులు: బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులం కావాలనుకుంటున్నాం సర్.
లోకేశ్ గురించి తండ్రి మాట..
‘పిల్లలూ మీరు స్కూల్‌కు డుమ్మా కొడితే.. తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. పిల్లలను చదివించడంలో లోకేశ్ కఠినంగా ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఆయన విద్యాశాఖ తీసుకున్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి.. ఆగస్టులోపు కొత్త టీచర్లను స్కూల్స్‌కు పంపే బాధ్యత తీసుకున్నారు. నేను ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన పేరెంట్ కమిటీలను లోకేశ్ మరో ఎత్తుకు తీసుకెళ్లారు’ అని సీఎం అన్నారు.
నా పేరెంట్ మీట్‌కు నాన్న వచ్చేవారుకాదు
ముఖ్యమంత్రిగా మీ పిల్లల కోసం వచ్చారు.. మొక్కలు
నాటాలన్న పవన్ అన్న సవాల్ స్వీకరిస్తున్నా: లోకేశ్
సీఎంగా మీ పిల్లల కోసం వచ్చారు: లోకేశ్
తాను చదువుకునే రోజుల్లో పేరెంట్ మీట్‌కు తన తండ్రి చంద్రబాబు వచ్చేవారు కాదని, తన తల్లే అన్నీ చూసుకునేవారని మంత్రి లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇప్పుడు నా కుమారుడు దేవాన్ష్ పేరెంట్ మీట్‌కు నేను వెళ్లలేని పరిస్థితి. నా భార్య బ్రాహ్మిణి అన్నింటికీ వెళుతున్నారు. కానీ మీ పిల్లల పేరెంట్ మీట్‌కు సాక్షాత్తు ముఖ్యమంత్రి హాజరయ్యారు. పిల్లల భవిష్యత్తుకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతకు ఇదే నిదర్శనం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పండుగ వాతావరణంలో పేరెంట్ మీట్ జరుగుతోందని సంతోషం వ్యక్తంచేశారు.
పవన్ అన్న సవాల్ స్వీకరిస్తున్నా..
తనకు సోదర సమానులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి మొక్కలు నాటాలంటూ ఇచ్చిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని లోకేశ్ వ్యాఖ్యానించారు. విద్యా శాఖ ద్వారా కోటి మొక్కలు నాటించి, మూడేళ్లు వాటిని పెంచే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారన్నారు. మొక్కలు పెంచడమనేది పవిత్రమైన బాధ్యత అని, అందువల్లే పిల్లలకు గ్రీన్‌పా్‌సపోర్టు ఇస్తున్నామని లోకేశ్ వివరించారు. ‘మంగళగిరిలో ఓటమితో తొలుత బాధ, ఆవేదన కలిగినా.. చివరకు ఆ ఘటన నాలో కసి పెంచింది. ప్రతిపక్షంలో ఉంటూ, ఐదేళ్లపాటు మంగళగిరిలోనే పనిచేసి... గతఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఆ స్థానం గెలుచుకున్నాను’ అని విద్యార్థులకు లోకేశ్ వివరించారు. ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయని, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అలా కాకుండా ఉండాలనే తన ఫెయిల్యూర్ స్టోరీ వివరించానని చెప్పారు.
Updated Date - Jul 11 , 2025 | 05:56 AM