Medicine Scam: మందులే మార్చేశారు
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:14 AM
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో రోగులకు పంపిణీ చేసే మందుల విషయంలో భారీ దోపిడీ జరుగుతోంది.
రోగులకు ప్రాణాధారమైన మందుల కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు చేస్తున్న అక్రమాలు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఒప్పంద కంపెనీతో లాలూచీపడి ముడుపులు దండుకుని.. పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాల నుంచి కొనాల్సిన ఔషధాలను జనరిక్, స్థానిక మందుల దుకాణాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వాటినే రోగులకు ఇస్తున్నారు. ఈ క్రమంలో రూ.కోట్ల మేరకు అధికారులు కమీషన్ల రూపంలో తమ జేబుల్లో వేసుకుంటున్నారు.
గుంటూరు, కడపలో ఇష్టారాజ్యం
స్థానికంగా మందులు కొనుగోలు చేసుకునే వెసులుబాటును బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న సూపరింటెండెంట్లు.. తమకు నచ్చిన చోట మందులు కొంటున్నారు. ముఖ్యంగా గుంటూరు, కడపలో మరీ దారుణంగా ఆస్పత్రి ఎదురుగా ఉన్న మందుల షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. రూ.లక్షల విలువైన మందులను కూడా నిబంధనలకు విరుద్ధంగా కొంటున్నారు. స్థానికంగా మందులు కొనుగోలుకు సంబంధించి టెండర్ పిలవాలి. ఎల్-1 కంపెనీని ఎంపిక చేసుకుని మందులు కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలి. కానీ, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు టెండర్ ప్రక్రియతో సంబంధం లేకుండా వారికి నచ్చిన షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ నిధులు దారిమళ్లడంతోపాటు.. నాణ్యత లేని ఔషధాలు ఆసుపత్రులకు చేరుతున్నాయి.
జన ఔషధి మందులకు బదులు రోగులకు జనరిక్ ఔషధాలు పంపిణీ
‘పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాల’ పేరిట దోపిడీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో రోగులకు పంపిణీ చేసే మందుల విషయంలో భారీ దోపిడీ జరుగుతోంది. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తుంటే.. అధికారులు మాత్రం సర్కారు సంకల్పాన్ని నీరుగారుస్తున్నారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాల(పీఎంబీజేకే) నుంచి కొనుగోలు చేయాల్సిన ఔషధాలను జనరిక్, స్థానిక మందుల షాపుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును రూ.కోట్లలో దండుకుంటున్నారు. మంగళవారం ‘బోధనాసుపత్రులకు జన ఔషధి శాపం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. తర్వాత పీఎంబీజేకే పేరుతో రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పీఎంబీజేకేతో బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు ఎంవోయులు చేసుకోవడం, ఎంవోయు చేసుకున్న కంపెనీ సరఫరా చేసిన మందులను పరిశీలిస్తే.. భారీ తేడాలు కనిపించాయి. ఆరోగ్యశాఖ అధికారులు ఏ ఉద్దేశంతో పీఎంబీజేకే నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు జన ఔషధి మందుల కోసం ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్న దగ్గర నుంచి అనేక అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. పీఎంబీజేకే ద్వారా వచ్చే మందులకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఎంవోయులకు అనుమతిచ్చామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరు. పీఎంబీజేకే హబ్‌లలో కేవలం 1,965 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
అవి కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. పైగా పీఎంబీజేకే పనితీరు వేరుగా ఉంటుంది. జన ఔషధి షాపుల యజమానులు వారికి అవసరమైన మందులు ఇండెంట్ పెట్టినా అవి అందుబాటులో ఉండడం లేదు. ఇండెంట్ పెట్టిన నెల తర్వాత హబ్స్‌లోకి వస్తున్నాయి. పైగా హబ్స్‌లో ఏ మందైనా రూ.వేలల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల సిబ్బంది ఒకే రకమైన టాబ్లెట్స్ లక్షల్లో ఆర్డర్లు ఇస్తారు. ఇంత భారీ స్థాయిలో మందులు సరఫరా చేసే సామర్థ్యం పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాలకు లేదు. పైగా బోధనాసుపత్రులకు అవసరమైన మందులు జన ఔషధి కేంద్రాల వద్ద అందుబాటులో ఉండవు. రాష్ట్రంలో చాలా బోధనాసుపత్రుల్లో ఎంవోయుకు విరుద్ధంగా సాధారణ జనరిక్ మందులు సరఫరా ్ఞఅయ్యాయి.
నాణ్యత ప్రశ్నార్థకం!
పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాలలో మందులు నాణ్యంగా ఉంటాయి. ఇలా నాణ్యమైన మందులు కాకుండా సాధారణ జనరిక్ మందులను సదరు ఒప్పంద కంపెనీ సరఫరా చేసింది. రోగులకు బ్రాండెడ్, జనరిక్ మందుల పట్ల అవగాహన లేకపోవడంతో బోధనాసుపత్రుల ఫార్మసీలో ఏ మందు ఇస్తే ఆ మందులు వాడేస్తున్నారు.
స్టిక్కర్ అడిగేవారేరీ?
పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాల ద్వారా మందులు ఆర్డర్ పెట్టే ముందు ఖచ్చితంగా పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన మందులు మాత్రమే సరఫరా చేయాలని ఆస్పత్రుల అధికారులు స్పష్టంచేయాలి. అనంతరం, సదరు కంపెనీ మందులు సరఫరా చేసిన తర్వాత అన్ని మందులపైన పీఎంబీజేకే-జన ఔషధి కేంద్రాల స్టిక్కర్లు ఉన్నాయో? లేవో? ఆసుపత్రుల్లో సిబ్బంది చూసుకోవాలి. బోధనాసుపత్రుల అధికారులు ఈ నిబంధనలు పాటించడం లేదు. జన ఔషధి మందులు సరఫరా చేస్తామని ఎంవోయు చేసుకున్న కంపెనీ వల్ల రోగులే కాకుండా బోధనాసుపత్రులకు కూడా తీవ్రనష్టం జరిగింది. ఆస్పత్రులకు ప్రభుత్వం కేటాయించిన నిధులు వృథా అవుతున్నాయి.
Updated Date - Jul 17 , 2025 | 05:14 AM