Human Rights Court Case: మావాళ్ల మృతదేహాలను అప్పగించాలి
ABN, Publish Date - May 24 , 2025 | 04:28 AM
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను శనివారం హైకోర్టు ధర్మాసనం చేపట్టనుంది.
హైకోర్టులో మావోయిస్టులు కేశవరావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల హౌజ్‌మోషన్ పిటిషన్లు
నేడు విచారించనున్న హైకోర్టు ధర్మాసనం
అమరావతి/గుంటూరు సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఛత్తీ్‌సగఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ నవీన్ మృతదేహాలను తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శుక్రవారం అత్యవసరంగా హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు, అలాగే సజ్జా నాగేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ వై.లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరపనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఛత్తీ్‌సగఢ్ పోలీసులు, శ్రీకాకుళం ఎస్పీ, చీరాల ఒకటో పట్టణ పోలీసులు మృతదేహాలను అప్పగించడానికి నిరాకరించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్‌లో వారు కోరారు. వారి తీరు చూస్తే బూటకపు ఎన్‌కౌంటర్ అనే సందేహం కలుగుతోందన్నారు. మృతదేహాలను అప్పగించాలని కోరితే పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. వ్యాజ్యాలు పరిష్కారం అయ్యేవరకు మృతదేహాలను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు.
ఎస్పీ అడ్డుకుంటున్నారు
నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ, కేశవరావు కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వెళ్లకుండా శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా, సజ్జా నాగేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం పలు ప్రజాసంఘాల నేతలు పరామర్శించారు.
Updated Date - May 24 , 2025 | 04:29 AM