Luggage Scanners: మొరాయించిన లగేజీ స్కానర్లు
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:18 AM
తిరుమలలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం లగేజీ స్కానర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్సులు, సొంత, అద్దె వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని ఇక్కడి స్కానర్లలో తనిఖీ చేస్తారు.
అలిపిరి చెక్ పాయింట్ వద్ద తిప్పలు
మ్యాన్యువల్‌గా తనిఖీ చేసిన అధికారులు
భారీగా బారులు తీరిన వాహనాలు, భక్తులు
రెండున్నర గంటలపాటు ఇబ్బందులు
విద్యుత్ అంతరాయమే కారణం: సీవీఎస్వో
తిరుపతి(నేరవిభాగం), జూన్ 30(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం లగేజీ స్కానర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్సులు, సొంత, అద్దె వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని ఇక్కడి స్కానర్లలో తనిఖీ చేస్తారు. దీనికోసం 2021లో విహాంత్, వివాల్వ్ కంపెనీల ప్రతినిధులు ఆరు లగేజీ స్కానర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సర్వర్లు మొరాయించడంతో సోమవారం ఉదయం 6.55 గంటల ప్రాంతంలో లగేజీ స్కానర్లు పనిచేయడం మానేశాయి. దీంతో భక్తులు తమ లగేజీని స్కాన్ చేయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అలిపిరి ఏవీఎస్వో రమేశ్, విజిలెన్స్ విభాగం ఇన్‌స్పెక్టర్ పురుషోత్తంలు.. అదనపు సిబ్బందిని రంగంలోకి దింపారు. మ్యాన్యువల్‌గా భక్తుల లగేజీలు తనిఖీ చేసి కొండపైకి పంపారు. దీనివల్ల తనిఖీకి ఆలస్యమవడంతో వాహనాలు బారులు తీరాయి.
స్కానర్ల వద్ద భక్తుల క్యూ పెరిగింది. ఒక దశలో భక్తులు సహనం కోల్పోయి తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు టెక్నీషియన్లను పిలిపించి స్కానర్లు పనిచేయడానికి చర్యలు తీసుకున్నా విద్యుత్ అంతరాయంతో సర్వర్లు మొరాయించి.. పనిచేయలేదని తెలిసింది. చివరకు రెండున్నర గంటల తర్వాత స్కానర్లు పనిచేశాయి. అప్పటికే వందలాదిగా వాహనాలు, భక్తులు బారులుతీరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్లే స్కానర్లు పని చేయలేదని సీవీఎస్వో మురళీకృష్ణ తెలిపారు. కాగా, ఈ మ్యాన్యువల్ తనిఖీ సందర్భంగా ఓ భక్తుడు డ్రోన్ తీసుకు రావడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో అతడిని వెనక్కి పంపేశారు.
Updated Date - Jul 01 , 2025 | 05:18 AM