Nara Lokesh: తల్లికి గౌరవమూ ఇస్తాం
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:25 AM
ప్రభుత్వం మహిళలకు ‘తల్లికి వందనం’ ఇచ్చి ఊరుకోవడం లేదని, వారిని అన్ని విధాలా గౌరవిస్తుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ అన్నారు.
5న తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్లతో విస్తృత భేటీ: లోకేశ్
మహిళల ఆశీర్వాదంతోనే గద్దెనెక్కాం
కూటమి గెలుపు ప్రజల విజయం..
వారి విశ్వాసం వమ్ముకానివ్వను
బ్రాహ్మణితోపాటు నేనూ ఇంటి పనులు చేస్తా
చంద్రబాబు ప్రతి విజయం వెనుక నా తల్లి
మచిలీపట్నం సభలో లోకేశ్ స్పష్టీకరణ
మచిలీపట్నం టౌన్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మహిళలకు ‘తల్లికి వందనం’ ఇచ్చి ఊరుకోవడం లేదని, వారిని అన్ని విధాలా గౌరవిస్తుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి బందరు వచ్చిన ఆయన.. మూడు స్తంభాల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘తల్లికి వందనం’ లబ్ధిదారులు, బడికి వెళ్లే పిల్లల భవిష్యత్‌కు బాసటగా నిలుస్తామన్నారు. వచ్చే నెల 5వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవం ఇస్తుందన్నారు.
వారి ఆశీర్వాదంతోనే కూటమి గద్దె నెక్కిందని చెప్పారు. తన భార్య బ్రాహ్మణితో కలిసి తానూ కొన్ని ఇంటి పనులు చేస్తానన్నారు. సీఎం చంద్రబాబు విజయం వెనుక తన తల్లి భువనేశ్వరి ఉందని తెలిపారు. మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుంచీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు ఊహించని విధంగా 94 శాతం సీట్లు ఇచ్చి గెలిపించారని, ఈ విజయం రాజకీయ పార్టీల నాయకులది కాదని, ప్రజావిజయమని స్పష్టంచేశారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయబోమన్నారు. ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 23 కేసులు పెట్టారని.. చంద్రబాబును అకారణంగా 54 రోజులు జైలులో ఉంచారని, రవీంద్రను 53 రోజులు పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఎస్పీ గంగాధర్‌రావు, డీఈవో పీవీజే రామారావు, ఎంఈవో దుర్గాప్రసాద్, కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
జాహ్నవికి లోకేశ్ అభినందన
అమెరికా ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేష్ మిషన్‌కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్‌గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవిని మంత్రి లోకేశ్ అభినందించారు. బుధవారం సాయంత్రం జాహ్నవి ఉండవల్లి నివాసంలో ఆయన్ను కలిశారు. ‘తెలుగు బిడ్డగా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. భవిష్యత్తులో ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగు మహిళగా మీరు ఘనత సాధించారు’ అని ఆమెను లోకేశ్ అభినందించారు.
Updated Date - Jun 26 , 2025 | 05:25 AM