AP Weather Update: వెదర్‌మ్యాన్ అలర్ట్!
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:23 AM
వైజాగ్ వెదర్‌మ్యాన్, ఈస్ట్‌కోస్ట్ వెదర్‌మ్యాన్, శ్రీకాకుళం వెదర్‌మ్యాన్... వీళ్లంతా ఎవరనుకుంటున్నారా
వాతావరణ సమాచారమిచ్చే వ్యక్తులు
‘‘మరో రెండు, మూడు గంటల్లో విజయవాడ పరిసరాలు, దానికి ఆనుకుని మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉంది!’’
‘‘ఈ రోజు ఉదయం పది గంటలకు వైజాగ్‌లో పలుచోట్ల వర్షం కురుస్తుంది. కాబట్టి ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోగలరు!’’
- ఇవి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న వాతావరణ హెచ్చరికలు కావు! వ్యక్తులే ‘వెదర్‌మ్యాన్’గా అవతారమెత్తి... సోషల్ మీడియాలో పంపుతున్న సందేశాలు! అత్యధిక సందర్భాల్లో వాళ్లు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుండటం విశేషం!
సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్
వర్షాలు, ఎండలు, గాలులు, తుఫాన్లపై బులెటిన్లు
ఉద్యోగుల కోసం ఉదయం, సాయంత్రం సమాచారం
కేవలం అభిరుచితోనే ‘వెదర్‌మ్యాన్’ అవతారం
ప్రధాని ప్రశంసలు అందుకున్న ఏపీ వెదర్‌మ్యాన్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): వైజాగ్ వెదర్‌మ్యాన్, ఈస్ట్‌కోస్ట్ వెదర్‌మ్యాన్, శ్రీకాకుళం వెదర్‌మ్యాన్... వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? ‘వాన రాకడ’ను ఎప్పటికప్పుడు గుర్తించి... తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసే వ్యక్తులు! వీళ్లేమీ భారత వాతావరణ విభాగాని(ఐఎండీ)కి పోటీ కాదు! భారీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న వారూ కాదు! కేవలం... వాతావరణంపై ఆసక్తి, అభిరుచితో ‘వెదర్‌మ్యాన్’లుగా అవతరించారు. ప్రతిరోజూ, అత్యవసర సమయాల్లో సోషల్ మీడియాలో వాతావరణ సమాచారం అందిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఉన్నట్టుగానే మన రాష్ట్రంలోనూ పలువురు వెదర్‌మ్యాన్‌లు వర్షాలు, ఎండలు, ఈదురుగాలులు, తుఫాన్‌లపై నిరంతరం సమాచారం అందిస్తున్నారు. వీరంతా భౌతికశాస్త్రంతో అనుబంధం ఉన్న ఇంజనీరింగ్, వ్యవసాయశాస్త్ర పట్టభద్రులు. చిన్నప్పటి నుంచీ మేఘాలు, వర్షం అంటే ఉన్న ఇష్టంతో ఒకరు.. వాతావరణంపై మక్కువతో మరొకరు.. వెదర్‌మ్యాన్‌గా మారారు. వీళ్లకు ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఏపీ వెదర్‌మ్యాన్ సాయిప్రణీత్ (తిరుపతి), వైజాగ్ వెదర్‌మ్యాన్ సాయికిరణ్, ఈస్ట్‌కోస్ట్ వెదర్‌మ్యాన్ బెన్ని... ‘ఆంధ్రజ్యోతి’తో తమ అనుభవాలు పంచుకున్నారు.
హుద్‌హుద్‌ను చూశాక...
విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలోని తుంగ్లాం గ్రామానికి చెందిన సాయికిరణ్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. హుద్‌హుద్ తుఫాన్ తర్వాత ఇంటర్‌నెట్‌లో వాతావరణం గురించి అన్వేషిస్తూ పలు మోడళ్లను విశ్లేషించేవారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ సమయంలో వైజాగ్ వెదర్‌మ్యాన్ పేరుతో బులెటిన్లు ఇచ్చేవారు. సాయికిరణ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 లక్షలు, ఎక్స్‌లో 22 వేలు, యూట్యూబ్‌లో 10వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తుంగ్లాంలోని తన ఇంటిపై వాతావరణ సెన్సర్లు ఏర్పాటుచేసుకున్న సాయికిరణ్ ప్రస్తుతం చెన్నైలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ‘వాతావరణంపై కచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే తగిన అధ్యయనం అవసరం. రోజూ ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంట బులెటిన్ల తయారీకి కేటాయిస్తా. మొదట్లో వైజాగ్ వెదర్‌పై దృష్టిపెట్టాను. ఇప్పుడు ఏపీ మొత్తానికీ సమాచారం అందిస్తున్నా. చెన్నైలో ఉదయం, సాయంత్రం సమాచారం ఇస్తున్నా’ అని సాయికిరణ్ చెప్పారు.
వర్షం అంటే ఇష్టం
‘మాది విశాఖపట్నం. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశా. చిన్నప్పటి నుంచీ వాతావరణంలో మార్పులు గమనించేవాడిని. వర్షం కురుస్తుంటే చూస్తూ ఉండడం ఎంతో ఆనందంగా ఉంటుంది. వాతావరణంపై బులెటిన్లు తయారుచేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం హాబీగా మారింది. హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఆ తుఫాన్ చూసి అందరూ భయపడ్డారు. డిగ్రీ చదువుతున్నప్పుడే 2022 నుంచి ఏపీలో వెదర్ బులెటిన్లు ఇస్తున్నా. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 35వేలు, యూట్యూబ్‌లో 25వేలు, ఎక్స్‌లో దాదాపు మూడున్నరవేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతర్జాతీయ మోడల్స్ పరిశీలించి సొంతంగానే వాతావరణ సమాచారం చెబుతున్నా. రైతులు, ఉద్యోగులు, ఈవెంట్ ఆర్గనైజర్లు వాతావరణ సమాచారం కోసం అడుగుతుంటారు.’
- లింగాల బెన్ని, ఈస్ట్‌కోస్టు వెదర్‌మ్యాన్,
విశాఖపట్నం
సాయిప్రణీత్‌కు ప్రధాని ప్రశంశలు
తిరుపతికి చెందిన సాయిప్రణీత్ ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసి, ప్రస్తుతం బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. 2020లో వెదర్ ఆఫ్ సౌత్ ఇండియాగా తొలుత ప్రారంభించి తర్వాత ‘ఏపీ వెదర్‌మ్యాన్’గా పేరు మార్చి రాష్ట్రానికి వాతావరణ సమాచారం అందిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ వెదర్ మోడల్స్ నుంచి కీలక సమాచారం సేకరించి, అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లాతో, చెన్నైలోని వాతావరణ కేంద్రం అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు బులెటిన్లు ఇస్తున్నారు. ఏపీ వెదర్‌మ్యాన్ పేరిట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈయనకు ‘ఎక్స్’లో 80వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 లక్షలు, యూట్యూబ్‌లో 1.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో తన ఇంటికి ఆహ్వానించిన పలు రంగాల నిపుణుల్లో సాయిప్రణీత్ కూడా ఉన్నారు. ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలకుగాను ప్రధాని ఆయనను అభినందించారు. ‘బులెటిన్లు ఇచ్చే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటా. మనమిచ్చిన సమాచారం కచ్చితంగా ఉంటేనే నమ్మకం కలుగుతుంది. రోజుకు నాలుగుసార్లు బులెటిన్లు ఇస్తుంటా. అత్యవసరమైనప్పుడు మరింత సమయం వెచ్చిస్తుంటా. గులాబ్ తుఫాన్‌లో విశాఖ కలెక్టర్ మల్లికార్జున, కమిషనర్ సృజన తదితర అధికారులతో కలిసి రాత్రంతా మేల్కొని ఎప్పటికప్పుడు బులెటిన్లు ఇవ్వడం మర్చిపోలేని అనుభవం’ అని సాయిప్రణీత్ తెలిపారు.
Updated Date - Jul 24 , 2025 | 02:23 AM