Infrastructure Delay: కర్నూలు క్లస్టర్ వర్సిటీ.. కష్టాలు తొలగేనా
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:06 AM
కర్నూలు నగరంలో ఉన్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల..
కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు తీసుకొచ్చిన వర్సిటీ
వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం
దక్షిణ భారతదేశంలోనే తొలి విశ్వవిద్యాలయం
అసంపూర్తి నిర్మాణాలు.. అరకొర సిబ్బంది
నాటి పెండింగ్ బిల్లులు చెల్లించిన కూటమి ప్రభుత్వం
అయినా పనులు చేపట్టని కాంట్రాక్టర్
కొత్త పోస్టులు మంజూరైనా.. ఆర్థిక శాఖలో పెండింగ్
(ఆంధ్రజ్యోతి-కర్నూలు): కర్నూలు నగరంలో ఉన్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కళాశాలలను ఒకే గూటి కిందికి తీసుకువచ్చి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు.. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద 2015 డిసెంబరు 1న న్యూఢిల్లీలో జరిగిన ‘ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు’ సమావేశంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా.. డిగ్రీ కాలేజీల నూతన భవనాల నిర్మాణానికి రూ.55 కోట్లను రూసా మంజూరు చేసింది. ఆతర్వాత వైసీపీ ప్రభుత్వం ఏపీ క్లస్టర్ యూనివర్సిటీ యాక్ట్-2020 తీసుకొచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి ఆధిపత్యం వల్ల క్లస్టర్ వర్సిటీ కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం వివిధ కోర్సుల్లో డిగ్రీలో 3,300 మంది, పీజీలో 50 మంది విద్యార్థులు ఉన్నారు.
అసంపూర్తిగా భవనాలు: జగన్నాథగట్టుపై ట్రిపుల్ ఐటీడీఎం విద్యాలయం పక్కనే క్లస్టర్ యూనివర్సిటీకి 50.5 ఎకరాలు కేటాయించారు. అకడమిక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, బాలురు, బాలికల వసతి గృహం, సాధారణ సౌకర్యాల భవనాలు (లైబ్రరీ, ల్యాబ్, రీసెర్చ్ సెంటర్, స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్, ఇంక్యూబేషన్ సెంటర్) నిర్మాణాలకు రూ.80 కోట్లు మంజూరు కాగా, వైసీపీ ప్రభుత్వంలో అంతులేని జాప్యం, నిర్లక్ష్యంవల్ల అంచనా వ్యయం రూ. 139 కోట్లకు చేరింది. ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టిన ఈ భవన నిర్మాణాల కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన దక్కన్ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో రూ.65 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ హయాంలో రూ.20 కోట్లు బిల్లులు పెండింగులో పెట్టడంతో కాంట్రాక్టు సంస్థ పనులు ఆపేసింది. ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులు రూ.20 కోట్లు చెల్లించినా పనులు మొదలు పెట్టలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించింది. అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఇప్పటి వరకూ ఖ ర్చు చేసిన రూ.65 కోట్లు నిరుపయోగమయ్యాయి. వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి ఆదేశాల వల్లే కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
క్లస్టర్ వర్సిటీ సమస్యలపై దృష్టి పెట్టాలి
సీమ కృష్ణరాథోడ్, రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, కర్నూలు
క్లస్టర్ వర్సిటీకి తక్షణమే రెగ్యూలర్ వీసీని నియమించాలి. అసంపూర్తిగా ఉన్న భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలి. వైసీపీ హయాం లో ఉద్దేశపూర్వంగానే ఈ వర్సిటీని నిర్వీర్యం చేశారు. మంజూరైన పోస్టులకు ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చి నియామకాలు చేయాలి. నైపుణ్య శిక్షణ ద్వారా కరువు సీమ విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. ఈ వర్సిటీ భవనాలను ఇతర యూనివర్సిటీలకు ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలి.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:06 AM