Yogandhra 2025: పోలీస్ థీమ్ యోగా.. పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
ABN, Publish Date - May 29 , 2025 | 11:18 AM
Yogandhra 2025: రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అమరావతి, మే 29: యోగాంధ్ర (Yogandhra 2025) మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ (State Government Chief Secretary K. Vijayanand) ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. తనువు, మనసును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగా అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యసనాన్ని భాగం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. 26 జిల్లాల్లోనూ ప్రతిరోజూ ఒక ఇతివృత్తంతో ఉత్సాహంగా పండగ వాతావరణంలో యోగా కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు.
రైతులు, విద్యార్థులు, కార్మికులు ఇలా ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాకు నాలుగు చొప్పున పర్యాటక ప్రాంతాల్లో యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.
విజయవాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో పోలీస్ థీమ్ యోగా కార్యక్రమంలో దాదాపు అయిదువేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం) ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్ వీరపాండ్యన్, సీసీఎల్ఏ, ఎన్‌టీఆర్ జల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఏనుగుల బీభత్సం.. ఫారెస్ట్ అధికారులపై అటాక్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest AP News And Telugu News
Updated Date - May 29 , 2025 | 11:44 AM