AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ
ABN, Publish Date - May 08 , 2025 | 11:19 AM
AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
న్యూఢిల్లీ , మే 8: ఏపీ లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) నిందితులకు సుప్రీం కోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ ముగ్గురికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
కాగా.. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు చేసింది. ఈ క్రమంలో నిన్న(బుధవారం) ఈ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో ఈరోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు.. హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు.
ఏపీ హైకోర్టులో వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినందున.. హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే సుప్రీంలో దాఖలైన ఈ పిటిషన్ నిరర్ధకమైందని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ అయినా చేయాలి లేదా కొత్త పిటిషన్ అన్నా దాఖలు చేయాలని.. అంతవరకు దీనిని అనుమతించవద్దని ముకుల్ రోహత్గీ చెప్పారు. రోహత్గీ వాదనలతో ఏకభవించిన కోర్టు.. గతంలో వేసిన పిటిషన్‌ను సవరించి మరో పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. అయితే 13 వరకు తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని ముగ్గురి తరపున వాదించిన న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. కానీ మధ్యంతర రక్షణ కల్పించేందుకు కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. అప్పటి వరకు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. మధ్యంతర బెయిల్‌పై మళ్లీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 13న విచారణ జరిపి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్
Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన
Read latest AP News And Telugu News
Updated Date - May 08 , 2025 | 11:37 AM