Anam Ramnarayana Reddy: దుర్గమ్మ ఆలయాభివృద్ధిలో కీలక మార్పులు
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:35 PM
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయ అభివద్ధిలో కీలక మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
విజయవాడ, జూన్ 23: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారన్నారు. అమ్మవారి ఆలయనికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసిజర్‌లో భాగంగా అన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బల్లలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేశ ఖండనశాలలను ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారన్నారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని.. వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా.. మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. దసరా నవరాత్రులు అనంతరం కృష్ణ పుష్కరాలు నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
For More Andhrapradesh News and Telugu News
Updated Date - Jun 23 , 2025 | 04:18 PM