CM Chandrababu Delhi Visit: కేంద్రమంత్రి జోషితో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్
ABN, Publish Date - May 23 , 2025 | 12:46 PM
CM Chandrababu Delhi Visit: ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశమయ్యారు.
అమరావతి, మే 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో (Union Minister Prahlad Joshi) ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషీతో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ ముక్తి బిజిలి యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలోకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు పదివేల రూపాయల వరకూ సబ్సీడీతో సోలార్ రూఫ్ టాప్‌లో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్తు ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా.. ఈరోజు ఉదయం కేంద్రమంత్రి ప్రహాద్ జోషిని సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ కేటాయింపులు ఇవ్వాలని సీఎం కోరారు. హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఓ ప్రతిపాదనను సమర్పించారు. 2025 జనవరిలో ఏపీడిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రతిపాదన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు లభిస్తాయని. అలాగే బీసీ గృహాలకు కిలోవాట్‌కు రూ.10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా సబ్సీడీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర క్లీన్ ఎనర్జీ పాలసీ 2024–29 లో భాగంగా అదనంగా 72.6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, ఇందులో 40 గిగావాట్ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకుందని.. ఇది సామాన్యులకు కూడా సౌరశక్తిని అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు. ప్రతిపాదిత యుటిలిటీ నేతృత్వంలోని రూఫ్‌టాప్ మోడల్ ఏపీ విద్యుత్ కొనుగోలు వ్యయాలను తగ్గించడంతో పాటు, బలహీన వర్గాలకు సాధికారత కల్పిస్తుందని, ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్రం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి మున్ముందు మార్గనిర్దేశం చేయగలదని, ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర రక్షణ మంత్రితో సమావేశం
అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ దూరదృష్టిని కేంద్ర రక్షణ మంత్రికి సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన సహకారం, వ్యూహాత్మక సంస్థాపనలతో కూడిన సమగ్ర ప్రణాళికను వివరించారు. ఈ ప్రతిపాదనలలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ యూనిట్ల అభివృద్ధి, కీలక తయారీ యూనిట్ల పునరుద్ధరణ, స్వదేశీ విమానయాన కార్యక్రమాలకు మద్దతు, టెస్టింగ్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేకంగా స్థానికంగా లభించే సామర్థ్యాలను ప్రోత్సహించడానికి తగ్గ రక్షణ కేంద్రాల సృష్టి ఉన్నాయన్నారు. పటిష్టమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, క్రియాశీలక విధాన వాతావరణంతో ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ ఉత్పత్తి, ఆవిష్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం
ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు
Read Latest AP News And Telugu News
Updated Date - May 23 , 2025 | 01:53 PM