ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kodandarama Kalyanam: కమనీయం కోదండరాముని కల్యాణోత్సవం

ABN, Publish Date - Apr 12 , 2025 | 03:23 AM

పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు

  • పండు వెన్నెలలో... నెలరాజు సాక్షిగా... సీతమ్మ మెడలో రామయ్య మాంగల్యధారణ

  • తిలకించి, పులకించిన వేల మంది భక్తులు

  • పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు

  • సంప్రదాయ పంచెకట్టుతో ఆలయ ప్రవేశం

  • తిరుమల నుంచి మైథిలికి స్వర్ణకిరీటం..

  • రామచంద్రుడికి యజ్ఞోపవీతం కానుకలు

  • భక్తజన సంద్రంగా మారిన ఒంటిమిట్ట

  • ఏకశిలానగరంలో మార్మోగిన రామనామం

కడప/రాజంపేట/ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం శుక్రవారం రాత్రి రమణీయంగా.. కమనీయంగా జరిగింది. రఘుకుల తిలకుడు, దశరథ తనయుడు శ్రీరామచంద్రమూర్తికి, జనక మహారాజు సుపుత్రిక జానకీదేవితో కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిండారబోసినట్లున్న పండు వెన్నెలలో, నెలరాజు సాక్షిగా.. టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్య ఘోషలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సర్వమంగళ స్వరూపుడైన శ్రీరాముడు, మహాలక్ష్మీ స్వరూపిణి సీతమ్మ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాత్రి 8.10 గంటలకు టీటీడీ ఆగమశాస్త్ర పండితులు కంకణబట్టర్‌ రాజేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మాంగల్య ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనుల మనసులు సంబరంతో ఉప్పొంగాయి. కల్యాణ క్రతువును ఆసాంతం చూసి ఆనందంతో పులకించారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఒంటిమిట్ట జనసంద్రమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేసిన చంద్రబాబుకు వేద పండితులు, టీటీడీ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి తరఫున రామయ్యకు యజ్ఞోపవీతం, అమ్మవారికి స్వర్ణకిరీటాన్ని టీటీడీ కానుకగా అందించింది.


వైభవంగా శోభాయాత్ర, ఎదుర్కోలు ఉత్సవం

ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర శుక్రవారం సాయంత్రం వైభవంగా సాగింది. కల్యాణ వేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ఈ ఉత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. అమ్మవారి తరపున ఆచార్య చక్రవర్తుల రంగనాథ్‌, స్వామివారి తరపున ఆచార్య ఆకెళ్ల విభీషణశర్మ పాల్గొన్నారు. దారిపొడవునా శ్రీవారి సేవకుల కోలాటాలు, నృత్యాలు, భజనలతో కోలాహలం నెలకొంది. భక్తకోటి చేసిన రామనామ స్మరణలతో ఎకశిలానగరం మార్మోగింది.

ఆకట్టుకున్న కల్యాణవేదిక కళాకృతులు

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా... త్రేతాయుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా కల్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతారాల సెట్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరకు గెడలు, కొబ్బరి పూత, అరటి ఆకులు, మామిడి ఆకులు,కాయలు, విదేశీ పుష్పాలతో చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండురోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది వేదికను తీర్చిదిద్దారు.

ఒంటిమిట్టలో సీఎం బస

సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్టకు వచ్చిన సీఎం చంద్రబాబు దంపతులు శుక్రవారం రాత్రి ఇక్కడే బస చేశారు. ఈ సందర్భంగా బారీ పోలీసు బందోస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం బయలుదేరి సీఎం విజయవాడ వెళ్లనున్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 04:54 AM