Political Violence: నరుకుతాం.. చంపుతాం!
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:23 AM
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలది అరాచక బాటే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ ఏడాది క్రితం బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు..
వైసీపీ కార్యకర్తల ‘నరుకుడు’ భాష!.. జగన్ పర్యటనల్లో ఫ్లెక్సీలతో బెదిరింపులు
పొదిలిలో తొక్కి పడేస్తామని హుంకరింపు
సత్తెనపల్లిలో ‘రప్పా రప్పా’ డైలాగులు
రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు
ముదురుతున్న వైసీపీ క్షుద్ర రాజకీయం
రౌడీలకు పరామర్శల పేరిట అరాచకం
బెట్టింగ్‌లు పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం
రెంటపాళ్ల పర్యటనలో ఇద్దరు మృతి
అమరావతి/ సత్తెనపల్లి/ నర్సరావుపేట/ గుంటూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలది అరాచక బాటే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ ఏడాది క్రితం బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు బుధవారం పల్నాడు జిల్లా తెనాలిలోని రెంటపాళ్లకు వెళ్లినా.. వికృత రూప ప్రదర్శనే.. ప్రస్తుతం విపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లోనూ ‘మళ్లీ అధికారంలోకి వచ్చాక... చంపేస్తాం, నరికేస్తాం’ అని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ‘‘ఎవడైనా రానీ.. తొక్కి పడేస్తాం! 2029లో వైఎస్సార్‌సీపీ రాగానే.. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా! వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం.. పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు!’ అంటూ తెనాలి, పొదిలి, సత్తెనపల్లిల్లో జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రెంటపాళ్ల ప్రాంతం సున్నితమైందని, ఇరుకైన వీధులు.. కనుక వంద మందికే పర్యటన పరిమితం చేసుకోవాలని పోలీసులు సూచించినా బుధవారం పట్టించుకోకుండా జగన్ ‘అంతా నా ఇష్టం’ అనేలా వ్యవహరించారు. అనుమతులతో తనకు పనిలేదని, ఆంక్షలు తనను అడ్డుకోలేవని మందీ మార్బలంతో విచ్చలవిడిగా చెలరేగుతున్న జగన్ హడావిడికి బుధవారం 2 నిండు ప్రాణాలు బలయ్యాయి.
ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న జగన్ పర్యటన
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సత్తెనపల్లిలో నృత్యం చేస్తూ కుప్ప కూలిన అదే పట్టణ వైసీపీ కార్యకర్త పి.జయవర్ధన్ రెడ్డి రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు అతడ్ని ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. జయవర్ధన్ రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు 174 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఏటుకూరు సమీప లాల్‌పురం జాతీయ రహదారి వద్ద.. జగన్‌పై పూలు చల్లేందుకొచ్చిన చీలి సింగయ్య (53).. వైసీపీ అధినేత కాన్వాయ్ వాహనం ఢీ కొట్టడంతో కింద పడ్డాడు. అతడి భుజం మీదుగా కారు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డ సింగయ్యను ఆస్పత్రికి తరలించే వారే కరువయ్యారు. హైవే పెట్రోలింగ్ ఏఎ్‌సఐ రాజశేఖర్ అక్కడికి చేరుకుని సింగయ్యను జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
హెచ్చరికలు బేఖాతరుచేసినందుకే.: ఎస్పీ
జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందడానికి పోలీసుల హెచ్చరికలు, ఆదేశాలను బేఖాతరు చేయడమే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన కాన్వాయ్‌లోని 11 వాహనాలతో పాటు అదనంగా మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లి నుంచే 35కి పైగా వాహనాలతో రెంటపాళ్లకు కాన్వాయ్ బయలుదేరిందన్నారు. మధ్యలో మరికొన్ని వాహనాలు జత కలిశాయని సతీశ్ కుమార్ తెలిపారు. వంద మందికి మించి సమీకరించొద్దని పోలీసులు జారీ చేసిన ఆదేశాలను బేఖాతరు చేశారని చెప్పారు.
Updated Date - Jun 19 , 2025 | 04:23 AM