IIT Tirupati Boost: తిరుపతి ఐఐటీకి మహర్దశ
ABN, Publish Date - May 08 , 2025 | 04:24 AM
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో తిరుపతి ఐఐటీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఐఐటీలకు అధునాతన మౌలిక సదుపాయాలు లభించనున్నాయి. నూతన ప్రొఫెసర్ పోస్టులు, సీట్ల పెంపుతో విద్యారంగం మరింత బలోపేతమవుతుంది
మౌలిక సదుపాయాల పెంపు
ఐఐటీల్లో పెరగనున్న 6,500 సీట్లు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): ఐఐటీ సహా పారిశ్రామిక శిక్షణ(ఐటీఐ), నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడంతోపాటు ఆయా విద్యాసంస్థలను మరింత ఆధునీకరించేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఐఐటీలకు నిధు లు, సీట్ల సంఖ్య పెంపునకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కోసం ఐదు ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐఐటీల విస్తరణకు రూ.11,828 కోట్లు, ఐటీఐల ఆధునీకరణ, ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ల ఏర్పాటుకు రూ.60,000 కోట్లు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఏపీలోని తిరుపతి ఐఐటీ సహా కేరళ, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటకలలోని 5 ఐఐటీలకు మహర్దశ పట్టనుంది. వీటిలో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యాన్ని పెంచనున్నారు. 130 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. వచ్చే 4 సంవత్సరాల్లో సీట్లను మరో 6,500లకు పైగా పెంచనున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐల నవీకరణ, 5 జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్థి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News
Updated Date - May 08 , 2025 | 04:24 AM