ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించండి

ABN, Publish Date - May 07 , 2025 | 04:45 AM

హైకోర్టు, 1994లో అసైన్డ్‌ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుండి తొలగించమని, సైనికోద్యోగికి పదేళ్ల తర్వాత భూమి విక్రయించుకునే హక్కు ఉందని పేర్కొంది. తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు

  • అసైన్డ్‌ భూమిపై సైనికోద్యోగికి సంపూర్ణ హక్కులు లభిస్తాయి

  • పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వారు అర్హులే

  • జీవోలు, సీసీఎల్‌ఏ సర్క్యులర్‌ ఇదే చెబుతున్నాయి

  • తిరుపతి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటా కింద కేటాయించిన భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని మాజీ సైనికోద్యోగి చేసుకున్న దరఖాస్తును జిల్లా కలెక్టర్‌ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 1993లో జారీ చేసిన జీవో 1117, భూపరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) 2022 మే4న జారీ చేసిన సర్క్యులర్‌ను పరిశీలిస్తే అసైన్డ్‌ చేసి పదేళ్లు దాటిని భూమిని విక్రయించుకొనే అధికారం మాజీ సైనిక ఉద్యోగులకు ఉందని స్పష్టం చేసింది. పదేళ్ల తర్వాత ఆ భూములు స్వభావాన్ని కోల్పోతాయని, ఆ భూమిపై సైనికోద్యోగికి సంపూర్ణ హక్కులు లభిస్తాయని పేర్కొంది. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగి జీవితానికి భద్రత కల్పించడంతోపాటు దేశానికి సేవలు అందించినందుకు హక్కుగా సైనికోద్యోగులకు భూకేటాయింపు చేస్తారని గుర్తు చేసింది.


ఈ నేపథ్యంలో మాజీ సైనికోద్యోగులకు కేటాయించే భూమిని, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే అసైన్డ్‌పట్టాతో సమానంగా చూడడానికి వీల్లేదని పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌కు 1994లో మాజీ సైనికోద్యోగి కోటా కింద అసైన్డ్‌ పట్టా కేటాయించారని గుర్తు చేసింది. 2004తో పదేళ్లకాలం ముగిసిందని తెలిపింది. తహసీల్దార్‌ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండానే పిటిషనర్‌ దరఖాస్తును తిరస్కరిస్తూ కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని ఆక్షేపించింది. 2022 ఆగస్టు 29న జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామ పరిధిలోని సర్వే నం.310/3పి2లోని 3.50 ఎకరాల భూమిని తక్షణం రిజిస్ట్రేషన్‌ నిషేధిత ఆస్తుల జాబితా 22(ఏ) నుంచి తొలగించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీసీడీ శేఖర్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు.

Updated Date - May 07 , 2025 | 04:45 AM