Heavy Rains: వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:51 PM
దక్షిణ కోస్తా తీరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
విశాఖపట్నం, జులై 25: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అందులో భాగంగా ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ రోజు.. అంటే శుక్రవారం ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఈ వాయుగుండం కారణంగా.. కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అలాగే ఉత్తర కోస్తా తీరా ప్రాంతంలోని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని స్పష్టం చేసింది.
అయితే దక్షిణ కోస్తా తీరంలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇక ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. గడిచిన 24 గంటల్లో పాలకొండలో అత్యధికంగా ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 05:59 PM