ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rainfall: సింహాచలంలో భారీ వర్షం

ABN, Publish Date - May 01 , 2025 | 05:41 AM

సింహాచలంలో అర్ధరాత్రి 2.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసి రక్షణ గోడ కూలిపోయింది. వర్షంతో పాటు పిడుగులు, ఉరుములు, గాలులు తీవ్ర నష్టానికి దారి తీసాయి.

  • అర్ధగంటలోనే 2.5 సెంటీ మీటర్లు నమోదు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. దీనిపై వాతావరణ శాఖ ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 2.30 నుంచి మూడు గంటల మధ్య నగరంలోని పలు ప్రాంతాల్లో 65 కి.మీ.వేగంతో బలమైన గాలులు వీచినట్టు వాల్తేర్‌లోని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రంలో నమోదైంది. సింహాచలం, గోపాలపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో కూడా దాదాపు అదేస్థాయిలో పెనుగాలులు వీచి ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అర్ధగంట వ్యవధిలో సింహాచలంలో 2.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ లెక్కల మేరకు పావుగంటలోపు 0.3సెంటీమీటర్లు, గంటలో 1.2 సెంటీమీర్లు నమోదైతే దానిని భారీ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈ లెక్కన సింహాచలంలో భారీవర్షం కురిసిందని వాతావరణ నిపుణుడు తెలిపారు. 2020 సెప్టెంబరులో గులాబ్‌ తుఫాన్‌ సమయంలో సింహాచలంలో భారీ పెనుగాలులతో 31.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. ఏప్రిల్‌, మే నెలల్లో స్వల్ప వ్యవధిలో సంభవించే ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుల్‌ స్తంభాలు కూలిపోతుంటాయని పేర్కొన్నారు. అయితే రక్షణ గోడలు కూలడం వంటివి అరుదని తెలిపారు. కాగా, అర్ధరాత్రి 12 గంటల తర్వాత తొలుత శ్రీకాకుళం, ఒంటి గంటకు పార్వతీపురం మన్యం, విజయనగరం, 1.30 గంటల తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


దీనికి సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థను అప్రమత్తం చేసింది. దీని ప్రకారం శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు ప్రజల సెల్‌ఫోన్లకు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మెసేజ్‌లు వచ్చాయి. అయితే నిద్రలో ఉండడంతో చాలామందికి ఈ విషయం తెలియదు. విశాఖ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత పిడుగులు, ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది. అదే సమయంలో సింహగిరిపై రక్షణగోడ కూలి ఏడుగురు మృతిచెందారు. కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమలో వివిధ ప్రాంతాలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో చెదురుమదురుగా లేదా తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీశైలంలో గాలివాన బీభత్సం

ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం గాలివాన, వడగళ్లతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మధ్నాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొందరి ఇళ్లు, గోడలపై చెట్లు కూలాయి. క్షేత్ర పరిధిలో మొత్తంగా సుమారు 20 చెట్లు కూలగా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగువ అటవీ ప్రాంతంలో నుంచి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీల్లో వర్షపు నీరు పోటెత్తింది.

Updated Date - May 01 , 2025 | 05:43 AM