Good Governance: ఘనంగా తొలి అడుగు
ABN, Publish Date - Jul 03 , 2025 | 04:47 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.
తొలిరోజు ఉత్సాహంగా సుపరిపాలన కార్యక్రమం
ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు వివరించిన ప్రజాప్రతినిధులు
పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు
ఏలూరు జిల్లాలో జోరువానలోనూ కొనసాగిన కార్యక్రమాలు
మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణికి మహిళల హారతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిరోజు బుధవారం అత్యధిక నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర సుల్తానగరంలోని ఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృత్తివెన్నుమండలం ఇంతేరు గ్రామంలో పర్యటించగా.. రోడ్లు వేయించాలని, ఇళ్లపట్టాలు, తాగునీటిని సక్రమంగా ఇప్పించాలని గ్రామస్థులు కోరారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గన్నవరంలో ప్రభుత్వవిప్ యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగులసంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కొనసాగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి ఇన్‌చార్జి లేకపోవడంతో అక్కడ తొలి అడుగు కార్యక్రమం నిర్వహించలేదు. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎంపీ ఎం.శ్రీభరత్ కార్యక్రమాలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కొనసాగాయి. అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం మొదలైంది. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కొనసాగాయి. కడప, అనమ్నయ్య జిల్లాల్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం టీడీపీ నేతలు ఇంటింటి బాట పట్టారు. కడప జిల్లా పులివెందులలో బీటెక్ రవి, రాయచోటి నియోజకవర్గంలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జోరు వర్షంలోనూ తొలి అడుగు
ఏలూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నా తొలి అడుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కేంద్రంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, మేయర్ షేక్ నూర్జహాన్, దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ మహేశ్ యాదవ్ పాల్గొన్నారు. చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ అందుబాటులో లేకపోవడంతో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ఆరంభించారు. కైకలూరు, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేనందున నియోజకవర్గ కన్వీనర్లు గన్ని వీరాంజనేయులు, బొరగం శ్రీనివాసరావు, అచ్యుతరావులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్, అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, గోరంట్ల మండలం వానవోలులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్షం కురుస్తున్నా ఇంటింటికీ పర్యటించారు. నంద్యాల పట్టణంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పర్యటించి ప్రజల సమస్యలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఓ మహిళ చిన్నారికి స్నానం చేయిస్తుండగా.. మంత్రి సైతం సదరు చిన్నారికి స్నానం చేయించడం ఆకట్టుకుంది. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి బనగానపల్లె నియోజకవర్గంలో, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ పట్టణం, ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, నెల్లూరు నగరంలో మంత్రి పొంగూరు నారాయణ, ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి, సత్యవేడు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమైంది.
Updated Date - Jul 03 , 2025 | 04:47 AM