Generic medicine: ప్రభుత్వాస్పత్రుల్లో జన ఔషధి కేంద్రాలు
ABN, Publish Date - May 11 , 2025 | 05:40 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జెనరిక్ మందుల ధరలను తగ్గించే లక్ష్యంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాలు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.
రోగులకు అతి స్పల్వ ధరలకే మందులు
త్వరలో ‘రెడ్‌క్రాస్’ ఆధ్వర్యంలో నిర్వహణ.. ప్రభుత్వ ఆమోదం
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల ప్రయోజనార్థం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రభుత్వాస్పత్రుల్లో 23 ప్రైవేటు జనరిక్ మందుల షాపులున్నాయి. వీటిని స్వయం సహాయక బృందాలు, ఇతర సంఘాలకు కేటాయించినప్పటికీ, ప్రయివేటు వ్యక్తులు వాటిని చేజిక్కించుకుని భారీ లాభాలతో నడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు జనరిక్ ఔషధాల తయారీ, ధరలు నిర్ణయించే విధానంలో లొసుగులను ఉపయోగించుకుంటూ రోగులను దోపిడీ చేస్తున్నట్లు అనేక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను పరిష్కరించి, నాణ్యమైన జనరిక్ మందులు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజనను ప్రవేశపెట్టింది. వీటిని ఇప్పుడు ప్రభుత్వాస్పత్రిల్లో లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుకు వచ్చింది.
Updated Date - May 11 , 2025 | 05:41 AM