Artificial Insemination: 150కే పెయ్యదూడ
ABN, Publish Date - Jul 01 , 2025 | 03:09 AM
గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు
ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ శ్రీనివాసరావు
గుంటూరు సిటీ, జూన్ 30(ఆంధ్రజ్యోతి): గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు(ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసుల లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్ర్తీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.
Updated Date - Jul 01 , 2025 | 07:32 AM