Early Monsoon Arrival: కేరళను తాకిన నైరుతి
ABN, Publish Date - May 25 , 2025 | 04:05 AM
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణానికి ఎనిమిది రోజులు ముందుగానే కేరళను తాకాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
16 ఏళ్ల తర్వాత 8 రోజులు ముందుగా దేశంలోకి వచ్చిన రుతుపవనాలు.. 2-3 రోజుల్లో రాష్ట్రానికి
నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): కోట్లాది మంది రైతన్నలకు చల్లని కబురు. వేసవి ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం. ఈ ఏడాది 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. 16 ఏళ్ల తర్వాత సాధారణ తేదీ (జూన్ 1) కంటే వారం ముందుగా వచ్చాయి. దేశానికి అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళకు వస్తాయని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. ఐఎండీ అంచనాకు భిన్నంగా మూడు రోజుల ముందే కేరళను తాకాయి. కేరళలో పూర్తిగా, తమిళనాడులో 90 శాతం అంటే చెన్నై వరకు, కర్ణాటక, ఈశాన్యంలో మిజోరాంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కొమరిన్‌లో మిగిలిన భాగాలకు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలను తాకాయి. కొంకణ్‌కు ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం శనివారానికి వాయుగుండంగా బలపడడంతో నైరుతి రుతుపవనాలు ముందుగా దేశ భూభాగంలో ప్రవేశించాయి. గడచిన రెండు రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు బలంగా వీయడం, సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో సుమారు 50 కి.మీ. వేగంతో వీస్తుండడంతో కేరళను ముందుగానే రుతుపవనాలు తాకాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం వరకు రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. ఈ నెల 27వ తేదీన పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నందున ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం
జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలలను నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఏడాదిలో నమోదయ్యే వర్షపాతంలో 70 శాతం ఈ సీజన్‌లో కురుస్తుంది. దేశంలో 52 శాతం భూముల్లో పంటలను వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నారు. వర్షాధార భూముల నుంచి ఏటా 40 శాతం పంట దిగుబడి వస్తోంది. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే సీజన్ దీర్ఘకాల సగటులో 105శాతం నమోదు అవుతుందని ఐఎండీ ప్రకటించింది. ఈశాన్య భారత్‌లో అనేక ప్రాంతాలు, దక్షిణాదిలో తమిళనాడు, ఉత్తర భారత్‌లో జమ్ము కశ్మీర్, లద్దాఖ్ మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోర్ మాన్‌సూన్ జోన్ అంటే మధ్య భారత్, దానికి ఆనుకుని దక్షిణ, తూర్పుభారత్‌లో పలు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉన్న తటస్థ పరిస్థితులు నైరుతి రుతుపవనాల సీజన్ చివరి వరకు కొనసాగుతాయని, అందువల్ల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
నేడు, రేపు వర్షాలు
అరేబియా సముద్రంలోని వాయుగుండం ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరుగా, సోమవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. సోమవారం అల్లూరి, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. శనివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 45.2 మిల్లీ మీటర్లు, అరకబద్రలో 43 మిల్లీ మీటర్ల వాన పడింది. తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడులో రాబోయే 5 రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఢిల్లీతో పాటు జమ్ము, కశ్మీర్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నెల 29వ తేదీ వరకు కేరళ, కోస్టల్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ముందస్తు వేసవితోనే..
ఐఎండీ రిటైర్డ్ డీజీ కేజీ రమేశ్
దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారం నుంచే ఎండలు పెరగడంతో వాతావరణం వేడెక్కిందని, దీంతో ఏప్రిల్ నుంచే వానలు ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేశ్ విశ్లేషించారు. 27వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో 27 లేదా 28వ తేదీన ఏపీలోని అనేక ప్రాంతాలను రుతుపవనాలు తాకుతాయని రమేశ్ అంచనా వేశారు.
గత 16 ఏళ్లలో కేరళను రుతుపవనాలు తాకిన తేదీలు
2009 మే23
2010 మే31
2011 మే29
2012 జూన్5
2013 జూన్1
2014 జూన్6
2015 జూన్5
2016 జూన్8
2017 మే30
2018 మే29
2019 జూన్8
2020 జూన్1
2021 జూన్3
2022 మే29
2023 జూన్8
2024 మే30
Updated Date - May 25 , 2025 | 04:07 AM