Liquor Scam: రాజ్ సహాయకుడు అరెస్ట్
ABN, Publish Date - May 02 , 2025 | 04:40 AM
వైసీపీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన రాజ్ సహాయకుడు దిలీప్ చెన్నైలో అరెస్టయ్యాడు. విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించిన దిలీప్‌ను సిట్ అధికారులు అడ్డుకున్నారు
సిట్ అదుపులో క్యాష్ హ్యాండ్లర్ దిలీప్.. చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయత్నం
ముందే లుక్ ఔట్ సర్క్యులర్ జారీ.. చెన్నైలో అరెస్టు చేసి.. బెజవాడకు తరలింపు
మద్యం కమీషన్లు వసూలు చేసిన ఐదుగురిలో దిలీప్ ఒకరు!
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో వ్యక్తిని అరెస్టు చేసింది. మద్యం విధానం రూపకల్పన నుంచి వసూళ్ల వరకూ కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుల్లో ఒకరైన పైలా దిలీప్‌ను గురువారం చెన్నై విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిస్టిలరీస్ యజమానుల నుంచి నగదు తీసుకుని రాజ్ కసిరెడ్డి చెప్పిన చోటుకు చేర్చిన క్యాష్ హ్యాండ్లర్స్‌లో దిలీప్ కీలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇటీవలే కసిరెడ్డిని అరెస్టు చేసి విజయవాడ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో మద్యం పాలసీ రూపకల్పన మొదలు వసూళ్ల వరకూ ఎవరెవరి పాత్ర ఏమిటో కోర్టుకు వివరించింది.
రాజ్ తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి అలియాస్ సుమిత్, మరో సన్నిహితుడు చాణక్య, దిలీప్ పేరు కూడా అందులో ప్రస్తావించింది. రాజ్ కూడా చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు పథకం రూపొందించుకున్న విషయం బయట పడింది. ఆయనను హైదరాబాద్‌లోనే పోలీసులు పట్టేసుకున్నారు. ఈ క్రమంలో చెన్నైలో రాజ్ కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీయగా ఆయన వ్యక్తిగత సహాయకుడు దిలీప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన సిట్ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ సైతం జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. దీంతో తనను సిట్ అధికారులు అరెస్టు చేస్తారని ఆయన భయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో నిఘా ఉంటుందని.. చెన్నై నుంచి టికెట్ బుక్ చేసుకుని దుబాయ్ చెక్కేసేందుకు యత్నించారు. కానీ లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయిందని తెలియక... నేరుగా బోనులో పడ్డారు.
దిలీప్ పాత్ర ఏంటి?
దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న ఏడంచెల వ్యవస్థలో దిలీప్ ఒకరు. మద్యం కంపెనీల నుంచి నగదు వసూలు చేసేందుకు చాణక్య.. ఖురేషి, సైఫ్, దిలీప్, సందీప్, చిష్టిలను సహాయకులుగా నియమించుకున్నారు! వీరు ప్రధాన క్యాష్ హ్యాండ్లర్లుగా వ్యవహరించారు. కసిరెడ్డి ఇచ్చిన ఫోన్లు, నంబర్లు వాడుతూ డిస్టిలరీస్ యజమానులకు ఫోన్లు చేసి... ప్రతిసారీ ఒక కొత్త చోటుకు రమ్మని చెప్పేవారు. డబ్బులు చేతికి అందగానే ఫోన్ నంబరు కూడా మార్చేవారు. దిలీప్ ఎక్కువసార్లు హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనే నగదు తీసుకుని చాణక్య చెప్పిన చోటుకు చేర్చి ఆ విషయాన్ని రాజ్ కసిరెడ్డికి వివరించే వారు. స్కామ్‌లో అరెస్టయిన వారి సంఖ్య ఇప్పటికి నాలుగుకు చేరింది. కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి(ఏ1), సజ్జల శ్రీధర్ రెడ్డి(ఏ6), చాణక్య(ఏ8) ఇప్పటికే విజయవాడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా అరెస్టైన దిలీప్‌ను శుక్రవారం సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకూ 27మంది నిందితుల జాబితా బయట పెట్టిన దర్యాప్తు బృందం దిలీప్ పేరు నిందితుల జాబితాలో చూపించలేదు. అయితే విచారణకు రావాల్సిందిగా నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను కస్టడీకి తీసుకుని కమీషన్ల వివరాలు రాబట్టే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ
Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్
Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి
Updated Date - May 02 , 2025 | 04:40 AM