Pawan Kalyan: వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ..
ABN, Publish Date - May 19 , 2025 | 08:19 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖ రాశారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని, తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.
విజయనగరంలో ఒక యువకుడికి ఐసిస్‌తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘావర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలన్నారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, అలాంటి వారి కదలికలపైనా అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తం అవ్వాలని సూచించారు. ఎక్కడైనా ఉగ్ర నీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.
ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలతోపాటు అంతర్గత భద్రతపైనా ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలకి ఏపీ సహకారం తోడవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read:
GVMC Dy Mayor: డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. లోకేశ్ సీరియస్
Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు
Prashant Kishore: జన్‌సురాజ్ పార్టీ తొలి అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్
Updated Date - May 19 , 2025 | 09:32 PM