Delhi Students Crisis: ఢిల్లీ నుంచి వచ్చేదెలా
ABN, Publish Date - May 12 , 2025 | 04:13 AM
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థులకు సెలవులు ఇచ్చి, రైళ్ల రిజర్వేషన్లు, విమాన చార్జీలలో పెరుగుదలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్‌లో వారికి వసతి, భోజన సౌకర్యాలు అందించి, రైళ్ల రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తున్నారు
భారత్, పాక్ ఉద్రిక్తతలతో వర్సిటీలకు సెలవులు
రైళ్లలో రిజర్వేషన్ దొరక్క కష్టాలు.. పెరిగిన విమాన చార్జీలు
విధిలేక ఏపీ భవన్‌కు చేరుతున్న విద్యార్థులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని పలు యూనివర్సిటీలు బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థులకు సెలవులిచ్చి, స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరంతా స్వస్థలాలకు రావడానికి రైళ్లలో రిజర్వేషన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్సిటీల్లోని హాస్టళ్లను కూడా మూసివేయడంతో విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఢిల్లీతోపాటు హరియాణా, ఛండీగఢ్, పంజాబ్‌లలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల విద్యార్థులదీ ఇదే పరిస్థితి.
కొంతమంది తల్లిదండ్రుల సూచన మేరకు ఏపీ భవన్‌కు చేరుకుంటున్నారు. ఏపీ భవన్‌లో అధికారులు వసతి కల్పించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైళ్లలో రిజర్వేషన్ కల్పించి, విద్యార్థులను స్వస్థలాలకు పంపిస్తున్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉండటంతో రాజధాని, జీటీ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లలో రిజర్వేషనే దొరకడం లేదు. విమానాలకు డిమాండ్ ఏర్పడటంతో ఇదే అదనుగా చార్జీలు పెంచేశారు. రూ.7,500 ఉండే చార్జీని రూ.9,000 నుంచి రూ.10,000వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - May 12 , 2025 | 04:13 AM